Begin typing your search above and press return to search.

తెలంగాణ రాముడు..సీమ ఆంజేయుడు? కర్మ కాకపోతే ఏమిటిది?

By:  Tupaki Desk   |   21 April 2021 10:30 AM GMT
తెలంగాణ రాముడు..సీమ ఆంజేయుడు? కర్మ కాకపోతే ఏమిటిది?
X
కులం.. మతం.. ప్రాంతానికి మించిన మత్తు మరింకేమీ ఉండదు. కొన్నేళ్ల క్రితం వరకు కులం మాట తెలంగాణలో వినిపించేది కాదు. ఈ మధ్యన అది కాస్తా మొదలైంది. కులం గురించి.. కులానికి ఇచ్చే ప్రాధాన్యత గురించి తెలియాలంటే.. కోస్తాకు వెళితే చాలు.. పరిచయమైన పది నిమిషాల్లో కులమేమిటో తెలుసుకోపోతే.. ఆగమాగమయ్యే మైండ్ సెట్ కనిపిస్తుందంటారు. అలాంటి కులం తెలుగు ప్రజల్ని రోజు రోజుకు దెబ్బ తీస్తుందన్న సంగతి తెలిసిందే.

గడిచిన కొన్నేళ్లుగా మతం కూడా పెద్ద ఇష్యూగా మారింది. కొన్నిదశాబ్దాల క్రితం వరకు మతం అంత ప్రాధాన్యత అంశంగా ఉండేది కాదు. మతంలోకి రాజకీయం ఎప్పుడైతే అడుగు పెట్టిందో.. మనుషుల మధ్య చీలికలు మొదలయ్యాయి. అంతేకాదు.. మతం పేరుతో కొత్త రచ్చ మొదలైంది. ఇది సరిపోనట్లుగా తెలుగు ప్రజలకు ప్రాంతం ఒక పెద్ద సమస్యగా మారింది. ఒకే భాష మాట్లాడే ప్రజలు.. రెండు రాష్ట్రాలుగా కోరుకోవటం ఓకే అనుకుంటే.. విడిపోయి కలిసి ఉండాలన్న ప్రాధమిక నిమయాన్ని తుంగలోకి తొక్కి.. తోచినట్లుగా మాట్లాడుతున్న వైనం కొందరికి తిక్కరేగేలాంటి భావనను కలిగిస్తోంది.

ఇవాల్టి రోజున ఒక ప్రముఖ మీడియా సంస్థకు చెందిన భారీ స్టోరీని చూసినా.. తాజాగా టీటీడీ వారు ప్రకటించిన ప్రకటన.. తదనంతరం సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ వస్తున్న కామెంట్లు చూస్తే.. ఇదెక్కడి కొత్త తలనొప్పిరా? అన్న భావన కలుగక మానదు. శ్రీరామనవమిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక ప్రకటన చేసింది. అదేమంటే.. ఆంజనేయుడు (పురుణాల్లో కనిపించే దైవస్వరూపం) జన్మస్థలం తిరుమల గిరుల్లోని అంజనాద్రిగా పేర్కొంటూ అధికారిక ప్రకటన చేసింది.

కొద్దికాలం క్రితం టీటీడీ ఇదే విషయాన్ని వెల్లడించింది. తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటన చేవారు. తిరుమల గిరి కొండల్లోని అంజనాద్రిపై వెలసిన జపాలీ తీర్థమే ఆంజనేయుడి జన్మస్థలమంటూ తమ పండితులు ఆధారాలతో సహా ఫ్రూవ్ చేశారన్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని ఈ ప్రకటన చేసింది. ఓకే.. ఒక కొత్త విషయాన్ని శాస్త్రీయంగా వెల్లడించటాన్ని సమర్థించుకోవచ్చు. కానీ.. ఈ ప్రకటన వెలువడిన వెంటనే.. వాట్సాప్ గ్రూపుల్లో.. ‘సీమ హనుమంతుడు’ అంటూ మొదలైన పోస్టుల పర్వం చూసినప్పుడే మంట పుట్టకమానదు. అందరూ అభిమానించి.. పూజించే దేవతా స్వరూపాన్ని ఒక ప్రాంతానికి కట్టడి చేయటం.. మావోడు అంటూ జబ్బలు చరుచుకోవటం ఎంతవరకు సమంజసం అన్నది ప్రశ్న.

ఇదిలా ఉంటూ.. ఈ రోజు తెలంగాణ అధిపార్టీకి చెందిన నమస్తే తెలంగాణ మీడియా సంస్థను చూస్తే.. శ్రీరామ నవమిని పురస్కరించుకొని.. తెలంగాణ శ్రీరామన్న అంటూ గొప్పలు చెప్పుకోవటం చూస్తే.. ఈ ప్రాంతీయ భావజాలం తెలుగు ప్రజలకు కొత్త హద్దులు పెట్టేస్తుందని చెప్పాలి. ప్రాంతం ఏదైనా కావొచ్చు.. అక్కడి మనసులకు.. వారి మనోభావాలకు సంబంధం లేకుండా ప్రాంతీయతను అంటకట్టేయటం ఏమిటి? ఇప్పుడు దేవుళ్లను ప్రాంతీయ చట్రంలోకి ఇరికించేయటం చూసినప్పుడు.. హతవిధి అనుకోకుండా ఉండలేం. దేవుళ్లు.. ఈ ప్రాంతీయతత్త్వం ఏమిట్రా భగవంతుడా?