Begin typing your search above and press return to search.

జగన్ తో గొడవుంటే ఆంధ్రాలో చూసుకోవాలి: షర్మిలకు కేటీఆర్ కౌంటర్

By:  Tupaki Desk   |   23 April 2022 8:12 AM GMT
జగన్ తో గొడవుంటే ఆంధ్రాలో చూసుకోవాలి: షర్మిలకు కేటీఆర్ కౌంటర్
X
తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలపై విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యంగా బీజేపీని.. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ ను.. ఆఖరుకు వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిలపై కూడా హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో తన పాదయాత్రను పట్టించుకోవడం లేదన్న ఆమె ఆవేదనను కేటీఆర్ ఇలా తీర్చాడు. షర్మిలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన సీరియస్ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

ఒక ప్రముఖ చానెల్ ఇంటర్వ్యూలో కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. అనేక అంశాలపై మనసు విప్పి మాట్లాడారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు కేఏ పాల్, ప్రవీణ్ కుమార్ (బీఎస్పీ), వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రతిపక్షాలు కావచ్చేమో అని ఎద్దేవా చేశారు. ఈ ముగ్గురు నేతలను గుర్తించి ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ గాలి తీసేలా కేటీఆర్ మాట్లాడారు.

అలాగే కేంద్రప్రభుత్వాన్ని షర్మిల, ప్రవీణ్ కుమార్ తదితరులు ఎందుకు విమర్శించడం లేదని.. మోడీని అనే దమ్ము ధైర్యం వీరికి లేవని కేటీఆర్ ప్రశ్నించారు. వారి వెనుక ఏ పార్టీలున్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు.

అసలు ఏపీకి చెందిన షర్మిలకు తెలంగాణలో ఏం పని అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో ఆమెకు ఏం సంబంధముందని నిలదీశారు. అన్న సీఎం జగన్ తో గొడవ ఉంటే ఆంధ్రాలో చూసుకోవాలని షర్మిలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు కేటీఆర్.

ఈ సందర్భంగా ఒకప్పుడు తెలంగాణకు వెళ్లాలంటే వీసాలు, పాస్ పోర్టులు తీసుకోవాలంటూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్న దిషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఆంధ్రా నేతలకు తెలంగాణపై ప్రేమ ఉండదని.. వారికి అధికారం కోసం అర్రులు చాస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

షర్మిలపై తొలిసారి సూటిగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. దీనికి షర్మిల కౌంటర్ ఇస్తుందా? లేదా ? అన్నది వేచిచూడాలి.