Begin typing your search above and press return to search.

కోనసీమను కొల్లగొట్టే కంపెనీలకు ఇంకేం పట్టవా?

By:  Tupaki Desk   |   25 May 2021 11:30 AM GMT
కోనసీమను కొల్లగొట్టే కంపెనీలకు ఇంకేం పట్టవా?
X
ఒక ప్రాంతంలో ఉన్న సహజవనరులతో వేలాది కోట్లను సంపాదించే సంస్థలు.. ఆ ప్రాంతానికి కనీస సాయం చేయాలన్న ఆలోచన లేకపోవటాన్ని ఏమనాలి? రెండు తెలుగు రాష్ట్రాల్లో మరే ప్రాంతంలో లేని రీతిలో.. కోనసీమలో వేలాది కోట్ల రూపాయిల చమురునిక్షేపాలు ఉన్న విషయం తెలిసిందే. ఓఎన్జీసీ.. గెయిల్ తదితర సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఏళ్లకు ఏళ్లుగా కోనసీమలోని చమురును వెలికితీయటమే తప్పించి..ఆ ప్రాంతానికి చేసిందేమీ లేదు.

ఇప్పటివరకు గడిచిన రోజుల్ని వదిలేస్తే.. కరోనా కష్ట కాలంలో అయినా అలాంటి కంపెనీలు స్పందించాల్సిన అవసరం ఉంది కదా? సాధారణంగా కంపెనీలు తమ సామాజిక బాధ్యత పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాల్ని నిర్వహించాల్సి ఉంటుంది. అందుకోసం నిధుల్ని వినియోగించినట్లుగా ప్రభుత్వాలకు చూపించాల్సి ఉంది. మరి.. ఆ కంపెనీలు కోనసీమలోని 14మండల కేంద్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు పెడితే.. ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది కదా?

కరోనా కేసులు భారీగా పెరిగిపోయి.. ఆక్సిజన్ కోసం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వేళ.. సహజ సంపదను వాడేసే కంపెనీలు.. స్థానిక ప్రజల కోసం ఆక్సిజన్ ప్లాంట్లను ఇప్పటికే ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ.. అదేమీ పట్టని కంపెనీల తీరుపై జనసేన పార్టీకి చెందిన అమలాపురం నియోజకవర్గ ఇంఛార్జి శెట్టిబత్తుల రాజబాబు నిరసన షురూ చేశారు. అయితే.. ఆయన చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీంతో.. ఆయన తన ఇంటి ముందే కూర్చొని దీక్ష షురూ చేశారు. కరోనా వేళ దీక్షలతో ప్రజారోగ్యానికి ఇబ్బందులు తలెత్తే వీలుంది. అయితే.. రాజబాబు తెర మీదకు తెచ్చిన పాయింట్ మాత్రం విలువైనది. చమురునిక్షేపాల్ని తవ్వుకెళ్లే సంస్థలు.. కోనసీకు ఇప్పటివరకు చేసిందేమీ లేదు. కనీసం.. ఇప్పుడైనా చేయాల్సిన అవసరం ఉంది. ఈ కంపెనీల తీరుపై కన్నెర్ర చేయాల్సిన అవసరం సీఎం జగన్ కు ఉందన్నది మర్చిపోకూడదు. ఒక చూపు చూడకూడదా జగన్?