Begin typing your search above and press return to search.

కొత్త కాంబినేషన్..ఆ రెండు పార్టీలు కలవనున్నాయా?

By:  Tupaki Desk   |   13 Feb 2020 11:30 PM GMT
కొత్త కాంబినేషన్..ఆ రెండు పార్టీలు కలవనున్నాయా?
X
ముచ్చటగా మూడోసారి ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకున్నారు ఆమ్ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్. సామాన్యుడి చీపురు దెబ్బకు అంత పెద్ద మోడీషాలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిన పరిస్థితి. ఎన్నికల వేళలో తమదే అధికారమంటూ బీరాలు పలికి కమలనాథుల నోటి నుంచి మాటలు రాలేని విధంగా సింగిల్ డిజిట్ కు ఢిల్లీ రాష్ట్ర ప్రజలు పరిమితం చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ మారింది.

తాజా విజయంతో.. మోడీకి చెక్ చెప్పే మొనగాడు కేజ్రీవాల్ అన్న వాదన మరోసారి తెర మీదకు వచ్చింది. ఒకసారి జాతీయ రాజకీయాల్లోకి వచ్చి.. మళ్లీ వెనక్కి వెళ్లిన కేజ్రీవాల్.. తాజా విజయంతో సంప్రదాయ పార్టీలకు భిన్నమైన విధానాన్ని తెర మీదకు తీసుకువస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. కేజ్రీవాల్ కన్ను రెండు తెలుగు రాష్ట్రాల మీద పడేలా కొత్త ప్లానింగ్ జరుగుతోంది.

2015లో చారిత్రక విజయాన్ని సాధించిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను.. లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ స్వయంగా వెళ్లారు. తన రాజకీయ పార్టీ అయిన లోక్ సత్తాను ఆమ్ ఆద్మీ పార్టీలో విలీనం చేయాలని ఆయన భావించారు. అయితే.. దీని మీద కేజ్రీవాల్ పెద్ద ఆసక్తిని చూపించకపోవటంతో ఆ ప్రయత్నం అక్కడితో ఆగిపోయింది.

తాజాగా సాధించిన భారీ విజయంతో మళ్లీ ఈ ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీని దేశంలోని పలు రాష్ట్రాలకు విస్తరించాలన్నది కేజ్రీవాల్ ఆలోచనగా చెబుతారు. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వీలుగా లోక్ సత్తాను విలీనం చేయాలన్న చర్చ మళ్లీ తెర మీదకు వచ్చింది. 2009 ఎన్నికల్లో లోక్ సత్తా తన సత్తాను చాటటమే కాదు.. ఆసక్తికరంగా పది శాతం మేర ఓట్లను సాధించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఓట్ల కోసం పైసా కూడా పంచని ఆ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు రావటమే కాదు.. ఆ పార్టీ కారణంగా తుది ఫలితాల మీద ప్రభావాన్ని చూపించింది కూడా. ఇప్పటికి తెలుగు రాష్ట్రాల్లోని మధ్యతరగతి వారిలో లోక్ సత్తా మీద ప్రత్యేక అభిమానం ఉంది.

ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీలోకి లోక్ సత్తాను కలిపేస్తే.. ఆ కాంబినేషన్ కొత్త పరిణామాలకు కారణమవుతుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయని.. తెలుగు రాష్ట్రాల్లో ఆమ్ పార్టీ తన సత్తా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలు ఆసక్తికరంగా మారాయని చెప్పక తప్పదు.