Begin typing your search above and press return to search.

ఈసీ త‌ప్పుల్ని ఎత్తి చూపిన జేపీ మాట‌ల్లో లాజిక్ ఏమిటంటే?

By:  Tupaki Desk   |   29 March 2019 5:36 AM GMT
ఈసీ త‌ప్పుల్ని ఎత్తి చూపిన జేపీ మాట‌ల్లో లాజిక్ ఏమిటంటే?
X
ఎన్నిక‌ల వేళ‌.. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయ‌టం మామూలుగా జ‌రిగేదే. ఇలా త‌మ దృష్టికి వ‌చ్చిన ఫిర్యాదుల్ని జాగ్ర‌త్త‌గా చెక్ చేసి.. అందులో వాస్త‌వాలు ఉన్న‌ట్లు భావిస్తే.. ఫ‌లానా కార‌ణంతో ఫ‌లానా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా ప్ర‌క‌టించ‌టం మామూలే.

అందుకు భిన్నంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఏపీకి చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల‌పై బ‌దిలీ వేటు వేస్తూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీసుకున్న నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మారింది. ఒక పార్టీ చేసిన ఫిర్యాదు ఆధారంగా.. ఎలాంటి విచార‌ణ లేకుండా.. క్రాస్ చెక్ లేకుండా..ఫిర్యాదులు వ‌చ్చిన సంబంధిత అధికారుల వివ‌ర‌ణ తీసుకోకుండా వేటు ఎలా వేస్తార‌న్న ప్ర‌శ్న‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి.

పాల‌నా వ్య‌వ‌హారాల ప‌ట్ల‌.. చ‌ట్టం ప‌ట్ల అవ‌గాహ‌న‌.. వ్య‌వ‌స్థ‌ల ప‌ని తీరు ఎలా ఉండాల‌న్న విష‌యంపై ప‌ట్టు ఉన్న లోక్ స‌త్తా జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ తాజాగా చోటు చేసుకున్న బ‌దిలీల నిర్ణ‌యంపై రియాక్ట్ అయ్యారు. ఈ అంశంపై ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈసీ త‌ప్పు చేసిందంటూ ఏపీ అధికార‌ప‌క్షం వాదిస్తున్న వేళ‌.. ఈసీ నిర్ణ‌యంపై ఆయ‌న ఎలా రియాక్ట్ అయ్యారు? ఏం చెప్పార‌న్న‌ది చూస్తే..

+ ఒక పార్టీ చేసిన ఫిర్యాదును బట్టి - ఎలాంటి స్వతంత్ర విచారణ లేకుండా, సంబంధిత అధికారుల వివరణ తీసుకోకుండా.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని - డీజీపీని అడగకుండా.. ఎన్నికల సంఘం ఏకపక్షంగా ఏపీ ఉన్నతాధికారులను బదిలీ చేసిందని వార్తలు వస్తున్నాయి.. అదే నిజమైతే కచ్చితంగా అపశ్రుతి దొర్లినట్లే.

+ ఎన్నికల సంఘానికి స్వయంప్రతిపత్తి ఉంది.. ప్రజలు - పార్టీలు - పత్రికలు దానికి మద్దతునిస్తున్నాయి. కోర్టులు అసాధారణ సమయాల్లో తప్ప జోక్యం చేసుకోకుండా గౌరవమిస్తున్నాయి. దాన్ని కాపాడుకోకుండా ఎవరో చేసిన ఫిర్యాదును బట్టి అధికారులపై చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి లేదు

+ రాజ్యాంగం ఇచ్చిన విచక్షణాధికారాన్ని ఇష్టం వచ్చినట్లు వాడుకుంటాం. మేమే రాజులం.. చక్రవర్తులం ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటే పొరపాటు. కచ్చితంగా ప్రజాస్వామ్యానికి - న్యాయ వ్యవస్థకు జవాబు దారీతనంగా ఉండాల్సిందే.

+ ప్రభుత్వ అధికారుల వివరణ తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తికి, ప్రజాస్వామ్యానికి, ఎన్నికల నిర్వహణకు ప్రమాదకరం. ఇప్పటికైనా పొరపాటును సరిదిద్దుకోవాలి.

+ ఇతర దేశాల్లో మాదిరిగా ఎక్కడికక్కడ ఓటరు నమోదు విధానాన్ని మన దగ్గరా తీసుకురావాల్సిన అవసరం ఉంది. లోక్‌సత్తా తరఫున ఎన్నిసార్లు కోరినా ఫలితం ఉండటం లేదు. నగర ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలు భయంకరంగా ఉన్నాయంటే ఆ పాపం నూటికి నూరు శాతం ఎన్నికల సంఘానిదే తప్ప పార్టీలది.. ప్రభుత్వానిది ఎంత‌మాత్రం కాదు.

+ 1977లో జనతా ప్రభుత్వం వచ్చినప్పుడు కేవలం మూడు రోజుల్లో ఎన్నికలు అయిపోయాయి. దేశం మొత్తం చైతన్యం వచ్చి ప్రభుత్వమే మారిపోయిన అంతపెద్ద ఎన్నికలు మూడు రోజుల్లో అయిపోతే.. ఈసారి ఏడు విడతల్లో ఎన్నికలు ఎందుకో అర్థం కావడం లేదు. ఏ

+ ఏప్రిల్‌ 11న ఎన్నికలైతే మే 23 వరకు ఫలితాలు రాకపోవడం ఏంటి? ఎన్నికలను సాగదీసి తమ ప్రాభవాన్ని చాటుకోవాలి? ప్రచారం చేసుకోవాలని తప్పితే సమర్థంగా, సజావుగా నిర్వహించాలనే విషయాన్ని గుర్తించడం లేదు. ఈ విషయంలో ప్రపంచంలోని ఇతర దేశాలను చూసి నేర్చుకోవాలి.