Begin typing your search above and press return to search.

లోకేష్.. అమ‌రావ‌తి గురించి కాదు, రాష్ట్రం గురించి మాట్లాడు!

By:  Tupaki Desk   |   11 March 2020 3:30 AM GMT
లోకేష్.. అమ‌రావ‌తి గురించి కాదు, రాష్ట్రం గురించి మాట్లాడు!
X
రాజ‌ధాని ప్రాంతంలో మున్సిపాలిటీల విలీనాల వ్య‌వ‌హారం ఏదో పెండింగ్ లో ఉంది. ఈ నేప‌థ్యంలో అక్క‌డ స్థానిక ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌డం లేదు ఎన్నిక‌ల సంఘం. కేవ‌లం అమ‌రావ‌తి ప్రాంతంలోనే కాదు.. రాష్ట్రంలో వివిధ కార‌ణాల చేత అనేక స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు పెండింగ్ లో ప‌డ్డాయి. అయితే ఎన్నిక‌లు జ‌రుగుతున్న వాటి శాతంతో పోలిస్తే పెండింగ్ లో ఉన్న వాటి శాతం చాలా త‌క్కువ‌.

అయితే టెక్నికాలిటీస్ జోలికి వెళ్ల‌కుండా.. ఓట‌మి భ‌యంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం అమ‌రావ‌తిలో స్థానిక ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌డం లేద‌ని సెల‌విచ్చారు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్. అమ‌రావ‌తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రావ‌ని.. అందుకే అక్క‌డ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌డం లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

అయినా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అధికార పార్టీ చెబితే ఆగిపోయేదా?
దేశంలో ఎన్నిక‌ల సంఘం అంటూ ఒక‌టి ఉంటుంది. అది సాధార‌ణంగా రాజ‌కీయ పార్టీల ఒత్తిళ్ల‌కు త‌లొగ్గ‌దు. అందునా.. ఎన్నిక‌ల‌నే నిర్వ‌హించ‌కుండా ఆప‌డం అనేది ప్ర‌భుత్వాలు ఒత్తిళ్లు చేస్తే ఆగే అంశం కాద‌నేది ప్రాథ‌మిక జ్ఞానం ఉన్న వారు ఎవ‌రైనా చెబుతారు. అయితే లోకేష్ మాత్రం.. అమ‌రావ‌తిలో ఎన్నిక‌లు ఆగిపోయాయ‌ని, జ‌గ‌న్ పార్టీ భ‌యప‌డింద‌ని చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీ వాళ్లు త‌మ స్థాయిని పూర్తిగా అమ‌రావ‌తిలోని మూడు గ్రామాలకే త‌గ్గించుకున్నార‌ని చాలా మంది అంటుంటే.. ఈ మాట‌లు విన్నాకా ఆ విశ్లేష‌ణ‌లు నిజ‌మే అనుకోవాల్సి వ‌స్తోంది. అమ‌రావ‌తిలో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌క‌పోవ‌డం అనేది త‌మ విజ‌యం అన్న‌ట్టుగా లోకేష్ మాట్లాడుతూ ఉన్నారు. ఒక‌వైపు స్థానిక ఎన్నిక‌ల‌కు క్షేత్ర స్థాయిలో కార్య‌క‌ర్త‌ల‌ను ఉర‌క‌లెత్తించాల్సిన లోకేష్.. ఇలా అమ‌రావ‌తి అంటూ మాట్లాడ‌టం విడ్డూర‌మే.

తెలుగుదేశం పార్టీ రాజ‌కీయాల్లో నిల‌వాలి, ఉనికి చాటాలి అంటే.. అది అమ‌రావ‌తి లో కూర్చుంటే చాల‌దు, లోకేష్ ఇప్పుడు రాష్ట్రం మొత్తం టీడీపీ ఉనికిని కాపాడుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాలి. ఆయ‌న మాత్రం.. అమ‌రావ‌తి అంటూ.. అ..ఆ.. ల‌ను దాటేలా లేడ‌ని ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తున్నారు.