Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రులపై ఆథరైజ్డ్‌ నిఘా

By:  Tupaki Desk   |   11 April 2015 6:09 PM IST
ఏపీ మంత్రులపై ఆథరైజ్డ్‌ నిఘా
X
కేంద్రంలో నరేంద్ర మోడీ తన మంత్రుల నుంచి సీనియర్‌ అధికారుల వరకు అందరిపై నిఘా ఉంచుతారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ లోనూ దాదాపుగా అదే ధోరణి కనిపిస్తోంది. అయితే.... ఇక్కడ చంద్రబాబు ప్రమేయం ఏమీ లేకపోగా ఆయన తనయుడు లోకేశ్‌ పార్టీ, ప్రభుత్వంపై తన పట్టు పెంచుకునే క్రమంలో ఈ ఏర్పాటు చేసుకుంటున్నారు.

ఏపీ మంత్రుల పేషీలలో లోకేశ్‌ సూచనతో అధికారికంగా లైజాన్‌ ఆఫీసర్లను నియమించారు. వీరంతా లోకేష్‌ ఎంపిక చేసినవారే కావడం విశేషం. అయితే ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు తనకు లైజాన్‌ అదికారి అవసరం లేదని స్పష్టం చేయడంతో ఆయనను మినహాయించారని చెబుతున్నారు.

మంత్రుల పేషీల్లో ఉండే లైజన్‌ ఆఫీసర్లు రోజువారీగా మంత్రులను ఎవరెవరు కలిశారో.. ఏఏ సమావేశాలు జరిగాయి తదితర వివరాలన్నీ లోకేష్‌ కు తెలియజేస్తారు. వీరు మంత్రులకు పాలనపరంగా సహాయపడుతూనే మరో వైపు పార్టీ పరంగా కూడా వీరు లోకేష్‌ కు విధేయులుగా ఉంటారని అంటున్నారు. ఇది ఒకరకంగా మంత్రులపై నిఘా పెట్టడమేనని కొందరు వ్యాఖ్యానిస్తున్నా, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మంత్రులు ఎవరూ వీరిని కాదనలేని పరిస్థితి అని అంటున్నారు.పైగా మంత్రులకు సంబందించి పనితీరును సమీక్షించడానికి లోకేష్‌ ఇచ్చే నివేదికలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పరిశీలించవచ్చని సమాచారం.