Begin typing your search above and press return to search.

లోకేష్‌... డైటింగ్ కాదు.. డేరింగ్ కావాలి బాబూ...!!

By:  Tupaki Desk   |   13 March 2021 10:00 PM IST
లోకేష్‌... డైటింగ్ కాదు.. డేరింగ్ కావాలి బాబూ...!!
X
ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ ప‌రిస్థితి ఏమీ బాగోలేదు. ఎక్క‌డిక‌క్క‌డ గ్రూపు రాజ‌కీయాలు.. పెరిగిపోయాయి. అస‌లే అధికారం పోయి.. పార్టీ ప‌రిస్థితి దారుణంగా ఉంటే.. ఇప్పుడు జ‌రిగిన లోక‌ల్ ఎన్నిక‌ల్లో పార్టీ మ‌రింత‌గా దెబ్బ‌తింది. మ‌రి ఈ స‌మ‌యంలో ఏం చేయాలి? ఒక‌వైపు పార్టీ అధినేత చంద్ర‌బాబు 70 ఏళ్లు దాటిన వ‌య‌సులోనూ కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని తిరుగు తున్నారు. ఇంకా గొంతు చించుకుని ప్ర‌సంగాలు గుప్పిస్తున్నారు. నిత్యం నాయ‌కుల‌తో ట‌చ్‌లో ఉంటున్నారు. మ‌రి ఈ పార్టీకి భావి అధ్య‌క్షుడిగా.. ఏపీ రాష్ట్రానికి కాబోయే ముఖ్య‌మంత్రిగా(వీరాభిమానులు చెప్పేమాట‌) ప్ర‌చారంలో ఉన్న టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ ఏం చేస్తున్నారు? యువ‌కుడు, ఉత్సాహ వంతుడుగా ప్ర‌చారం చేసుకునే ఆయ‌న ఇప్పుడు చేస్తున్న‌ది పార్టీకి బ‌ల‌పేతంగా మారుతుందా? అనేది కీల‌క ప్ర‌శ్న‌.

విష‌యంలోకి వెళ్తే.. బొద్దుగా.. లావుగా ఉండే.. నారా లోకేష్ బాబు.. క‌రోనా పుణ్య‌మా అని.. హైద‌రాబాద్‌లోని ఇంటికే ప‌రిమిత ‌మై పోయారు. అంతేకాదు.. ఆ స‌మ‌యంలో ఆయ‌న ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకుని డైటింగ్‌లో ఉన్నారు. ఫ‌లితంగా శారీర‌కంగా అయితే.. ఆయ‌న‌లో మార్పులు క‌నిపించాయి. దీంతో ఆయ‌న భ‌జ‌న‌ప‌రులు కొంద‌రు ``మా లోకేష్ స‌న్న‌బ‌డ్డారు.. `` అంటూ.. ప్ర‌చారం మొద‌లు పెట్టారు. అయితే.. అదేస‌మ‌యంలో పార్టీలోని సీనియ‌ర్లు మాత్రం పెద‌వి విరుస్తున్నారు. `అయ్యా లోకేష్‌.. డైటింగ్ కాదు.. డేరింగ్ ఉండాలి రాజ‌కీయాల్లో!!`` అని గుస‌గుస‌లాడుతున్నారు. లోకేష్ పెత్త‌నంలో 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారం కోల్పోయింది. అంతెందుకు.. మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేసిన ఆయ‌నే ప‌రాజ‌యం పాల‌య్యారు.

ఇక‌, మ‌రో కీల‌క విష‌యం ఏంటంటే.. టీడీపీ అంటే.. కుప్పం అనే విధంగా ఉన్న కుప్పం(చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం)లో వైసీపీ పాగా వేసేసింది. ఇటీవ‌ల జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వైసీపీ జెండా పాతారు. దీంతో ఇప్పుడు టీడీపీలోని సీనియ‌ర్ల వేళ్ల‌న్నీ లోకేష్ వైపే చూపిస్తున్నారు. `స‌న్న‌బ‌డ‌డం కాదయ్యా.. గ్రామీణ రాజ‌కీయాలంటే.. ట్విట్ట‌ర్‌.. ఫేస్‌బుక్ కాదు.. గ్రామీణ ప్ర‌జ‌ల‌కు చేరువ కావాలి. గ్రామీణ రాజ‌కీయాల‌పై ప‌ట్టు సాధించాలి. కేడ‌ర్‌లో బ‌లం పెంచాలి. వారిలో భ‌రోసా నింపాలి`` అని సూచిస్తున్నారు. అంతేకాదు.. మ‌రికొంద‌రు సీనియ‌ర్లు అయితే.. ఎంత‌సేపూ.. సీఎం జ‌గ‌న్‌ను, ఆ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిని ట్విట్ట‌ర్ ద్వారా విమ‌ర్శించ‌డం కాద‌ని కూడా అనేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి చెప్పాలంటే.. టీడీపీలో సుదీర్ఘ ప్ర‌యాణం చేసిన‌, చేస్తున్న సీనియ‌ర్ నాయ‌కులు చాలా మంది ఉన్నారు. వీరి నుంచి లోకేష్ చాలానే నేర్చుకునే అవ‌కాశం ఉంది. కానీ.. ఏనాడూ వారిని ప‌ట్టించుకున్న‌ది లేదు. వారితో కూర్చుని చ‌ర్చించింది కూడా లేదు. అంతా నాకు తెలుసు.. వీళ్లెంత‌? అనే ధోర‌ణిలోనే లోకేష్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే కామెంట్లు ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ప్ర‌స్తుతం రాష్ట్రంలోని 110 నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ఇంచార్జ్‌లు ఇన్ యాక్టివ్‌గా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో వారిని యాక్టివ్ చేసే బాధ్య‌త‌ను తీసుకోవాల్సిన లోకేష్‌.. వారికి భ‌రోసాను నింపి.. పార్టీని ప‌రుగులు పెట్టించాల్సిన లోకేష్‌.. ఈ ప‌ని వ‌దిలేసి.. పిట్ట‌ను ప‌ట్టుకుని సందేశాలు పంపుతూ.. ప్ర‌చార యావ‌లో ప‌డ్డార‌నే విమ‌ర్శ‌లు పార్టీ సీనియ‌ర్ల నుంచే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. ఇలా అయితే.. అంత్యంత కీల‌క‌మైన గ్రామీణ రాజ‌కీయంపై ప‌ట్టు సాధించ‌డం కూడా క‌ష్ట‌మేన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టి మ‌రీ చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.