Begin typing your search above and press return to search.

మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే: లోకేష్

By:  Tupaki Desk   |   22 Nov 2021 9:11 PM IST
మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే: లోకేష్
X
ఏపీకి మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నట్టు సీఎం జగన్ చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది.. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల చట్టం ఉప సంహరణ బిల్లును ఏపీ అసెంబ్లీ ముందుకు తెచ్చింది. ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే ఉమ్మడి ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగలేదని.. అన్ని హైదరాబాద్ లో పెట్టారని చరిత్ర చెప్పారు. బ్రిటీష్ హయాం నుంచి ఇప్పటిదాకా మొత్తం హైదరాబాద్ లోనే పెట్టేశారని ఆరోపించారు. ఏపీ వ్యాప్తంగా పరిశ్రమలను పెట్టకుండా హైదరాబాద్ లో పెట్టి అన్యాయం చేశారని బుగ్గన చెప్పుకొచ్చారు.

మంత్రులు పేర్ని నాని, బొత్స సత్యనారాయణ దీనిపై క్లారిటీ ఇచ్చారు.. 'వెనక్కి తలొగ్గడానికి ఇది మోడీ ప్రభుత్వం కాదని.. జగన్ ప్రభుత్వం' అని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. పూర్తి సమగ్రమైన బిల్లుతో మళ్లీ సభ ముందుకు వస్తామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.

ఈ ప్రతిపాదనపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. మూడు రాజధానుల అంశంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలో చేసిన ప్రకటనపై నారా లోకేష్ ట్విట్టర్ లో స్పందించారు. గతంలో అమరావతి రాజధానికి మద్దతుగా జగన్ మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేశారు. ఈ సందర్భంగా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

లోకేష్ ట్వీట్ చేస్తూ .. 'తుగ్లక్ 3.0! మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే. అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేసారు. ఇళ్లు ఇక్కడే కట్టా, అమరావతే రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్లిన వ్యక్తి మూడు రాజధానులు చెయ్యమని ప్రజలు తీర్పు ఇచ్చారనడం హైలైట్. మురుగు బుర్రలకి మెరుగైన ఆలోచనలు రావడం ఎప్పటికీ జరగని పని.''అంటూ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం దీనిపై తీవ్ర విమర్శలు చేశారు.