Begin typing your search above and press return to search.

ఇక ఏపీ టీడీపీకి లోకేశే పెద్ద దిక్కు

By:  Tupaki Desk   |   18 July 2015 3:37 PM IST
ఇక ఏపీ టీడీపీకి లోకేశే పెద్ద దిక్కు
X
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేశ్ ఇకపై టీడీపీలో మరింత క్రియాశీలంగా వ్యవహరించనున్నారా...? ఆయన కీలక బాధ్యతలు చేపట్టనున్నారా అంటే ఆ పార్టీ, మీడియా వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లోకేశ్ టీడీపీలో కీలకంగానే వ్యవహరిస్తున్నారు. అయితే... ఆయనపై మరింత బాధ్యత పెట్టనున్నట్లు సమాచారం. లోకేశ్ ను ఆంధ్రప్రదేశ్ టీడీపీకి ఇంఛార్జి చేస్తారని పెద్ద ఎత్తున్ ప్రచారం జరుగుతోంది. ఇకపై ఆయన వారంలో మూడు రోజులు గుంటూరులో ఉండి ఏపీ వ్యవహారాలు చూస్తారని తెలుస్తోంది. ఇందుకు గాను ఇప్పటి కే గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయాన్ని భారీ ఎత్తున మార్పుచేర్పులు చేస్తున్నారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయాన్నే ఆంధ్రప్రదేశ్ టీడీపీ కార్యాలయంగా మార్చనున్నారు. నిజానికి విజయవాడలో దీన్ని ఏర్పాటు చేయాలని తొలుత భావించినా అక్కడి కార్యాలయం చిన్నదిగా ఉండడం పార్కింగు వసతి కూడా తక్కువగా ఉండడంతో గుంటూరు కార్యాలయాన్నే ఏపీ పార్టీ ఆఫీసుగా మార్చుతున్నారు.

ఈ నేపథ్యంలోనే గుంటూరు కార్యాలయాన్ని ఇటీవల లోకేశ్ సందర్శించారు. వాస్తు నిపుణులు కూడా దాన్ని పరిశీలించి ఓకే చేశారు. చేయాల్సిన మార్పు చేర్పులనూ సూచించారు. స్థానిక నేతల ఆధ్వర్యంలో కార్యాలయ మరమ్మతులు, ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ పూర్తయ్యాక చంద్రబాబు కూడా దీన్ని పరిశీలిస్తారు.

కాగా ఏపీ టీడీపీకి లోకేశ్ ను ఇంఛార్జి చేయడం కీలక పరిణామమే కానుంది. ఈ చర్యతో చంద్రబాబు తన తనయుడిని పూర్తిస్థాయిలో పొలిటికల్ వారసుడిగా రాటుదేల్చడానికి సిద్ధమైనట్లు అర్థమవుతోంది.