Begin typing your search above and press return to search.

మూడు రాజధానుల పై జయప్రకాష్ స్పందన ?

By:  Tupaki Desk   |   18 Dec 2019 5:59 AM GMT
మూడు రాజధానుల పై జయప్రకాష్ స్పందన ?
X
అధికార వికేంద్రీకరణ జరగాలనే ఒక గొప్ప లక్ష్యం తో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో మూడు రాజధాని నగరాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు మంగళవారం అసెంబ్లీలో చేసిన ప్రకటన పట్ల లోక్ సత్తా పార్టీ అధినేత మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ్ తన స్పందన తెలియజేసారు. వైఎస్ జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా జయప్రకాశ్ నారాయణ్ ఓ ప్రకటన చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. అధికారాన్ని వికేంద్రీకరించాలనే నిర్ణయాన్ని తప్పు పట్టలేమని ఆయన తన అభిప్రాయాన్ని తెలియ జేసారు.

అధికార వికేంద్రీకరణ జరగాలనే విషయాన్ని తాము ముందు నుంచీ చెబుతూనే వస్తున్నామని అన్నారు. ఒకే చోట, ఒకే ప్రాంతంలో అధికారాన్ని గానీ, అభివృద్ధిని గానీ కుప్పగా పోయడం వల్ల ఎలాంటి సత్ఫలితాలు రావని చెప్పారు. అధికార వికేంద్రీకరణ, పాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ తప్పనిసరిగా జరిగి తీరాల్సిన అవసరం ఏ రాష్ట్రానికైనా అవసరం అవుతుందని అన్నారు. లోక్ సత్తా ప్రధాన లక్ష్యం, ముఖ్య ఉద్దేశం అదేననే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో ఉండటం వల్ల ఆ ప్రాంత ప్రజలు మాత్రమే అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని, వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాలు పురోగమించవని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందాడానికి అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ వల్లే సాధ్యమని అలాంటి నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకోవడం స్వాగతించాల్సిన విషయమని అన్నారు.

అమరావతి ని కేంద్ర బిందువుగా చేసుకుని..మూడు రాజధానుల పరిపాలనా వ్యవహారాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలని జయప్రకాశ్ నారాయణ్ సూచించారు. ఈ నిర్ణయాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన బాధ్యత కూడా ఏపీ ప్రభుత్వం పై ఉందని అన్నారు. అలాగే తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ వంటి నాయకులు మూడు రాజధాని నగరాల నిర్ణయాన్ని స్వాగతించారు.