Begin typing your search above and press return to search.

రఘురామ అనర్హత వేటుపై స్పీకర్ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   12 July 2021 3:51 PM GMT
రఘురామ అనర్హత వేటుపై స్పీకర్ సంచలన వ్యాఖ్యలు
X
ఎంపీ రఘురామకృష్ణంరాజు అనర్హత వేటు విషయంలో వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ వి. విజయసాయిరెడ్డి చేసిన విమర్శలపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ నర్సాపురం ఎంపీ రఘురామపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని వైసీపీ ఎంత ఒత్తిడి తెచ్చినా స్పీకర్ మాత్రం నిర్ణయం తీసుకోవడం లేదు.

ఈ క్రమంలోనే తాజాగా విజయసాయిరెడ్డి మరోసారి కోరినా కూడా స్పీకర్ పట్టించుకోకపోవడంతో మీడియా ఎదుట స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఏడాదిగా ఫిర్యాదు చేస్తుంటే పట్టించుకోవడం లేదన్నారు. చర్యలు తీసుకోకుంటే పార్లమెంట్ లో నిరసనకు వెనుకాడబోమని విజయసాయిరెడ్డి అన్నారు.

ఈ వ్యాఖ్యలపై తాజాగా లోక్ సభ స్పీకర్ స్పందించారు. ఓం బిర్లా మాట్లాడుతూ 'పిటీషన్ పై నిర్ణయం తీసుకోవడానికి ఓ ప్రక్రియ ఉంటుందన్నారు. నిర్ణయం తీసుకునే ముందు ఇరుపక్షాలతో చర్చిస్తామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పరిశీలన అనంతరం సభాహక్కుల కమిటీ పరిశీలనకు పంపుతామన్నారు. సభలో ఎవరికైనా నిరసన తెలిపే హక్కు ఉంటుందని స్పీకర్ వ్యాఖ్యానించారు.

ఎంపీ రఘురామ అనర్హత పిటీషన్ పై రన్నింగ్ కామెంటరీ చేయలేమని ఘాటుగా బదులిచ్చారు. జూలై 19 నుంచి వర్షకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా సోమవారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని.. ఎంపీలకు కరోనా టెస్ట్ నెగెటివ్ రిపోర్టు ఉంటేనే అనుమతిస్తామన్నారు.టీకా తీసుకోని వారికి టెస్ట్ కంపల్సరీ అన్నారు.

అయితే జేడీయూ ఎంపీ శరద్ యాదవ్ పై అనర్హత ఫిర్యాదు ఇచ్చిన వారంలోనే రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అనర్హత వేటు వేశారని.. సుప్రీం తీర్పు ప్రకారం వెంటనే చర్య తీసుకోవాలన్నా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై ఆందోళన చేస్తామని స్పీకర్ కు మేం స్పష్టం చేశామన్నారు. దీంతో రఘురామ వ్యవహారం పార్లమెంట్ లో రచ్చకు కారణం కానుందని తెలుస్తోంది.