Begin typing your search above and press return to search.

బ్ర‌ద‌ర్స్ అండ్ సిస్ట‌ర్స్.. బాదుడు మొద‌లైంది!

By:  Tupaki Desk   |   21 May 2019 6:19 AM GMT
బ్ర‌ద‌ర్స్ అండ్ సిస్ట‌ర్స్.. బాదుడు మొద‌లైంది!
X
రోజుకో నాలుగైదు పైస‌లు చొప్పున బాదుతూ ఉంటే నెల గ‌డిచేస‌రికి రూపాయి 20 పైస‌లు.. నాలుగు నెల‌లు గ‌డిచేస‌రికి దాదాపు ఐదు రూపాయిల వ‌ర‌కూ పెరగ‌టం చూస్తున్నదే. కానీ.. గ‌డిచిన మూడు నెల‌లుగా పెట్రోల్.. డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌క‌పోవ‌టాన్ని గ‌మ‌నించారా? ఎందుక‌ని.. మోడీ మాష్టారికి మ‌న మీద ప్రేమ పొంగుకొచ్చిందా? అంటే.. లేద‌ని చెప్పాలి.

ఎన్నిక‌ల వేళ‌.. పెరిగే పెట్రోల్.. డీజిల్ ధ‌ర‌లతో ప్ర‌జాగ్ర‌హం త‌ప్ప‌ద‌న్న ఉద్దేశంతో ధ‌ర‌ల పెంపుపై కామ్ గా ఉంది. ఇటీవ‌ల కాలంలో అంత‌ర్జాతీయంగా చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ధ‌ర‌ల పెంపు త‌ప్ప‌నిస‌రి. ముడి చ‌మురు ధ‌ర పెర‌గ‌టం.. రూపాయి మార‌కం విలువ ప‌డిపోవ‌టం లాంటి వాటితో ధ‌ర‌ల్ని పెంచేస్తే.. ఆ ప్ర‌భావం సామాన్యుల మీద ప‌డి.. త‌మ‌కు ఓట్లు వేయ‌ర‌న్న ఉద్దేశంతో కామ్ గా ఉన్న‌ట్లుగా చెప్పాలి.

ఈ కార‌ణంగా నిత్యం భారీ ఎత్తున న‌ష్టాల్ని మూట‌క‌ట్టుకుంటున్నాయి చ‌మురు సంస్థ‌లు. ఆదివారం చివ‌రి విడ‌త పోలింగ్ ముగిసిన వెంట‌నే కేంద్రం ధ‌ర‌లు పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. లీట‌రు పెట్రోల్ మీద 9 పైస‌లు.. డీజిల్ మీద 15 పైస‌లు పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. గ‌డిచిన మూడు నెల‌లుగా బాదుడు లేకుండా ఉన్న ప్ర‌జ‌లకు రానున్న రోజుల్లో పెట్రోల్.. డీజిల్ భారం పెర‌గ‌టం ఖాయ‌మంటున్నారు. అమెరికా ఆంక్ష‌ల నేప‌థ్యంలో ఇరాన్ నుంచి చ‌మురు నుంచి దిగుమ‌తులు నిలిచిపోయిన ప‌రిస్థితి. ఇరాన్ నుంచి ముడిచ‌మురు కొనుగోలు చేస్తే భార‌త్ కు చౌక‌గా ల‌భించ‌ట‌మే కాదు.. ఆర్థికంగా కూడా లాభం చేకూరుతుంది. కానీ.. పెద్ద‌న్న‌కు ఆగ్ర‌హం క‌లిగించ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో ఇరాన్ నుంచి ముడిచ‌మురును కొన‌టం మానేసింది భార‌త్‌.

దీంతో.. ముడిచ‌మురు ఎక్కువ ధ‌ర‌కు కొనుగోలు చేయాల్సి వ‌స్తుంద‌న్న ఆరోప‌ణ ఉంది. ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్తి అయిన ప‌క్క రోజు నుంచే మొద‌లైన బాదుడు.. ఇక నిత్యం ఉంటుంద‌ని.. త్వ‌ర‌లోనే పెట్రోల్ డీజిల్ ధ‌ర‌లు లీట‌రు 80ను ట‌చ్ చేయ‌టం ఖాయ‌మంటున్నారు. ఎన్నిక‌ల పుణ్య‌మా అని మూడు నెల‌ల నుంచి భారం లేని సామాన్యుల‌కు రానున్న‌రోజుల్లో బాదుడు ఎఫెక్ట్ ఎంతలా ఉంటుందో అనుభ‌వంలోకి రానుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.