Begin typing your search above and press return to search.

జ‌నాల‌కు క‌డుపు మండేలా విదేశీ విరాళాల‌పై మోడీ నిర్ణ‌యం

By:  Tupaki Desk   |   19 March 2018 8:10 AM GMT
జ‌నాల‌కు క‌డుపు మండేలా విదేశీ విరాళాల‌పై మోడీ నిర్ణ‌యం
X
సామాన్యుడు సంపాదించే ప్ర‌తి రూపాయి మీదా ప‌న్ను వేసి ముక్కుపిండి వ‌సూలు చేసేందుకు ప్ర‌భుత్వాలు ప‌డే త‌ప‌న అంతా ఇంతా కాదు. ఆదాయంలోనే కాదు.. ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికి ప‌న్నులేయ‌టం మామూలే. ఇలాంటి పోట్ల‌కు అల‌వాటు ప‌డిపోయింది సామాన్య ప్ర‌జానీకం. ఇది స‌రిపోద‌న్న‌ట్లుగా ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఆధార్ తో బ్యాంక్ ద‌గ్గ‌ర నుంచి మొబైల్ క‌నెక్ష‌న్ వ‌ర‌కూ.. ఇవి అవి అన్న తేడా లేకుండా ప్ర‌తిది లింకు చేయించుకోవాల‌న్న హుకుం. అయితే.. సుప్రీంకోర్టు ఈ మ‌ధ్య‌న ఇచ్చిన మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల కార‌ణంగా లింకు విష‌యంలో మార్చి 31 గ‌డువును ఎత్తేశారు.

సామాన్యుడి విష‌యంలో క‌చ్ఛితంగా ఉండే ప్ర‌భుత్వాలు.. త‌మ విష‌యానికి వ‌చ్చేస‌రికి మాత్రం అంతులేని ఔదార్యాన్ని చూపించుకుంటాయి. చ‌ట్టం అంద‌రికి ఒక‌టే అయిన‌ప్పుడు.. జ‌నాల‌కు ఒక మాదిరి..రాజ‌కీయ పార్టీల‌కు మ‌రో మాదిరి రూల్స్ ఉండ‌కూడ‌దు క‌దా. ప్ర‌జ‌ల్ని పాలించే హ‌క్కు గుత్తుగా ఉండే పార్టీల‌న్నీ ఒకే నిర్ణ‌యానికి వ‌చ్చేసి.. ఈ మ‌ధ్య‌న గుట్టు చ‌ప్పుడు కాకుండా పాస్ చేయించుకున్న ఒక బిల్లు విష‌యం తెలిస్తే స‌గ‌టుజీవి క‌డుపు మండ‌టం ఖాయం. ఇంత బాధ్య‌తారాహిత్యంతో మోడీ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తుందా? అన్న సందేహం రాక మాన‌దు.

నోరు తెరిస్తే నీతులు చెప్పే ప్ర‌ధాని నేతృత్వంలోని స‌ర్కారు ఇటీవ‌ల పాస్ చేయించిన ఆర్థిక బిల్లుకు సంబంధించిన ఒక ముచ్చ‌ట జాతి జ‌నులు తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. విదేశీ విరాళాలు తీసుకునే విష‌యంలో రాజ‌కీయ పార్టీలు.. తాము తీసుకునే విరాళాల‌కు సంబంధించిన లెక్క‌ల్ని చెప్పాల్సిన అవ‌స‌రం లేదంటూ ఒక ఆర్థిక బిల్లుకు స‌వ‌ర‌ణ‌లు ప్ర‌తిపాదిస్తున్న బిల్లును ఆమోదించేశారు. ఈ మిన‌హాయింపును రాజ‌కీయ పార్టీల‌కు ఇస్తూ లోక్ స‌భ ఇటీవ‌ల స‌వ‌ర‌ణను ఆమోదించింది. దీంతో.. 1976 నుంచి విదేశాల నుంచి వివిధ రాజ‌కీయ పార్టీల‌కు అందే నిధుల‌ను వేటినీ స్క్రూట్రీ చేయ‌రు. తాజా స‌వ‌ర‌ణ పుణ్య‌మా అని.. వివిధ రాజ‌కీయ పార్టీల‌కు విదేశాల నుంచి వ‌చ్చే నిధుల లెక్క‌లు బ‌య‌ట‌కు రాన‌ట్లే.

ఒక‌వేళ ఏదైనా పార్టీకి విదేశీ నిధులు భారీగా వ‌చ్చి.. ఆ పార్టీ ప్ర‌జ‌ల్ని ప్ర‌భావితం చేస్తే.. త‌ర్వాత ఏం జ‌రుగుతుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌తి విష‌యంలోనూ ఓపెన్ గా ఉండాల‌న్న‌ట్లుగా మాట్లాడే మోడీ స‌ర్కారు హ‌యాంలో ఇంత కీల‌క నిర్ణ‌యాన్ని లోక్ స‌భ‌లో ఎలాంటి చ‌ర్చ లేకుండా ఆమోదించిన తీరు చూస్తే.. విస్మ‌యానికి గురి కాక త‌ప్ప‌దు. అంతేనా.. దేశాన్ని ప్ర‌భావితం చేసే విదేశీ నిధుల‌కు సంబంధించిన అంశంపై లోక్ స‌భ‌లో ఆమోదం పొందిన వైనంపై మొయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ పెద్దగా ప‌బ్లిష్ కాక‌పోవ‌టం చూస్తే.. ప‌లు సందేహాలు త‌లెత్త‌క మాన‌వు. తాజాగా ఆమోదం పొందిన దాని ప్ర‌కారం.. రాజ‌కీయ పార్టీలు విదేశాల నుంచి విరాళాలు స్వీక‌రించ‌టం నిషిద్ధ‌మ‌నే రూల్ బ్రేక్ అయిపోవ‌ట‌మే కాదు.. ఇక‌పై పార్టీలు త‌మ‌కు వ‌చ్చే విదేశీ నిధుల లెక్క చెప్పాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు. ప్ర‌జ‌ల‌కు ఒక రూల్‌.. రాజ‌కీయ‌పార్టీల‌కు మ‌రో రూల్ అన్న మాట‌.