Begin typing your search above and press return to search.

మోడీ వచ్చారు.. రచ్చ మాత్రం మామూలే

By:  Tupaki Desk   |   30 Nov 2016 10:18 AM GMT
మోడీ వచ్చారు.. రచ్చ మాత్రం మామూలే
X
పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంపై మండి పడుతున్నవిపక్షాలు.. రోజుకో తీరుగా వ్యవహరిస్తున్నాయి. ప్రధాని మోడీ సభకు హాజరుకావటం లేదని.. రద్దుపై ఆయన సభకు వచ్చి వివరణ ఇవ్వాలంటూ పట్టుబడుతున్నాయి. ఇదే పాయింట్ మీద గడిచిన కొద్ది రోజులుగా ఆందోళన చేపట్టిన విపక్షాలు.. సభను సాగకుండా అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే.

పార్లమెంటు సమావేశాల ప్రారంభం రోజున ఒకసారి.. మధ్యలో మరోసారి సభకు వచ్చిన మోడీ.. తర్వాత మాత్రం ఉభయ సభలకు హాజరు కావటం లేదు. ప్రధాని గైర్హాజరీపై నిరసన వ్యక్తం చేస్తున్న విపక్షాలు.. ఈ రోజు ప్రధాని సభకు వచ్చినా తమ తీరును మార్చుకోలేదు. నిన్నటి వరకూ ప్రధాని మోడీ సభకు ఎందుకు రావటం లేదని ప్రశ్నిస్తూ.. పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన‌లు చేసిన‌ వారు.. ఈ రోజు రద్దుపై ప్రభుత్వ నిర్ణయంపై నిరసనలు నిర్వహించాయి.

దీంతో.. పార్లమెంటు ఉభయ సభలు వాయిదా మీద వాయిదా పడుతున్నాయి. ఇదిలా ఉంటే లోక్ సభ విపక్షనేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు విషయంపై చర్చకు కాంగ్రెస్ వెనక్కి తగ్గటం లేదని స్పష్టం చేశారు. రూల్ నెంబరు 56 ప్రకారం చర్చ జరపాలన్న ఆయన.. చర్చ జరిపిన తర్వాత ఓటింగ్ నిర్వ‌హించాల‌ని.. అలా కాకుంటే తాము అంగీకరించమన్నారు. గడిచిన 13 రోజులుగా సభా కార్యకలాపాలు జరగటం లేదని.. అధికారపక్షం ఇప్పటికైనా తన మొండిపట్టును విడిచి చర్చకు రావాలని కోరారు. మరోవైపు.. తాము ఏ నిబంధన ప్రకారమైనా చర్చకు సిద్ధంగా ఉన్నట్లుగా బీజేపీ నేతలు స్పష్టం చేశారు. పెద్దనోట్ల రద్దుపై ప్రభుత్వం చర్చకు సిద్ధమే అయినా.. విపక్షాలే కావాలని సభా కార్యకలాపాల్ని అడ్డుకుంటున్నాయని మంత్రి అనంతకుమార్ ఆరోపించారు.

లోక్ సభకు తగ్గట్లే రాజ్యసభలోనూ గందరగోళ పరిస్థితి నెలకొంది. జమ్ముకశ్మీర్లోని జవాన్ల మృతి ఘటనపై చర్చ జరపాలంటూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఇదిలా ఉండగా.. సీనియర్ మంత్రులతో మోడీ సమావేశమై చర్చలు జరిపారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/