Begin typing your search above and press return to search.

తంబీల నిర‌స‌న గ‌ళం.. లోక్ స‌భ వాయిదా

By:  Tupaki Desk   |   27 March 2018 6:39 AM GMT
తంబీల నిర‌స‌న గ‌ళం.. లోక్ స‌భ వాయిదా
X
అంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న స‌మ‌యం రానే వ‌చ్చేసింది. గ‌డిచిన ఆరుద‌ఫాలుగా ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంపై వివిధ పార్టీలో ఇచ్చిన అవిశ్వాస తీర్మానం ఏ రోజుకు ఆ రోజు వాయిదా ప‌డుతున్న వైనం తెలిసిందే. ఇలాంటి వేళ‌.. ఈ రోజు అవిశ్వాసంపై చ‌ర్చ ఖాయంగా జ‌రుగుతుంద‌న్న అంచ‌నా వ్య‌క్త‌మైంది. దీనికి త‌గ్గ‌ట్లే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం త‌మ పార్టీ ఎంపీల‌ను స‌భ‌ను అడ్డుకోవ‌ద్ద‌న్న మాట‌ను బ‌లంగా చెప్పారు.

గ‌డిచిన ఆరు ద‌ఫాలుగా ఏపీ ప్ర‌త్యేక హోదాపై పెట్టిన అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు రాకుండా పోవ‌టానికి త‌మిళ‌నాడు అన్నాడీఎంకే ఎంపీల‌తో పాటు.. తెలంగాన రాష్ట్ర అధికార‌ప‌క్ష ఎంపీలు సైతంవెల్ లోకి దూసుకెళ్లి ఆందోళ‌న చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆరు ద‌ఫాలుగా స‌భ‌ను ఏ రోజుకు ఆ రోజు వాయిదా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంపై కాంగ్రెస్ పార్టీ సైతం అవిశ్వాస తీర్మానం పెట్ట‌టం.. మ‌రికొన్ని పార్టీలు సైతం మోడీ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టిన నేప‌థ్యంలో.. ఈ రోజు (మంగ‌ళ‌వారం) అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ ఖాయంగా జ‌రుగుతుంద‌న్న మాట వినిపించింది.

మూడు సెల‌వుల త‌ర్వాత ఈ రోజు ఉద‌యం లోక్ స‌భ ప్రారంభమైంది. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలంటూ ఏన్డీయే స‌ర్కారుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో స‌హా మొత్తం ఏడు పార్టీలు అవిశ్వాస తీర్మానంపై నోటీసులు ఇచ్చారు. దీంతో.. ఈ రోజు అవిశ్వాసంపై చ‌ర్చ‌కు అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

అయితే.. స‌భ ప్రారంభ‌మైన వెంట‌నే.. అన్నాడీఎంకే స‌భ్యులు వెల్ లోకి వ‌చ్చి పెద్ద పెట్టున నినాదాలుచేస్తూ.. స‌భ‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు.వారి ఆందోళ‌న నేప‌థ్యంలో స‌భ‌ను వాయిదా వేస్తున్న‌ట్లుగా స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. మ‌రి.. వాయిదా అనంత‌రం స‌భ ప్రారంభం కాగానే అవిశ్వాసంపై చ‌ర్చ జ‌రుగుతుందా? లేక‌. మొన్న‌టి త‌ర‌హాలోనే మ‌ళ్లీ వాయిదా ప‌డుతుందా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్త‌క‌రంగా మారింది.