Begin typing your search above and press return to search.

మోడీని దుయ్యబట్టి జైలు పాలయిన ఆమె ఎవ‌రంటే...

By:  Tupaki Desk   |   6 Sept 2018 11:53 AM IST
మోడీని దుయ్యబట్టి జైలు పాలయిన ఆమె ఎవ‌రంటే...
X
తమిళనాడుకు చెందిన 28 ఏళ్ల సోఫియా లూయిస్ కెనడాలో ఇండియన్ రీసెర్చ్ స్కాలర్. ఇందుకోసం ఆమె పాపుల‌ర్ కాలేదు...బీజేపీ ప్రభుత్వం - ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేసినందుకు పాపుల‌ర్ అయ్యారు. జైలు పాల‌వ‌డం వ‌ల్ల వార్త‌ల్లో నిలిచారు. త‌మిళ‌నాడుకు చెందిన ప్ర‌ముఖ హ‌క్కుల కార్య‌క‌ర్త అయిన సోఫియా గురించి ఇప్పుడు నెటిజ‌న్లు ఎందుకు ఆస‌క్తిక‌రంగా చ‌దువుతున్నారు? ఆమె బ్యాక్‌ గ్రౌండ్ ఏంటి అనేది ఇటు బీజేపీ వాదుల్లోనే కాకుండా అటు వామ‌ప‌క్ష భావ‌జాలం క‌ల సామాన్యులు కూడా ఆస‌క్తిని చూపుతున్న అంశం.

వివ‌రాల్లోకి వెళితే...సోఫియా కెనడా నుంచి తమిళనాడులోని ట్యూటికోరిన్‌కు విమానంలో నిన్న బయల్దేరింది. ఇదే విమానంలో తమిళనాడు బీజేపీ చీఫ్ తమిళిసాయి సౌందరరాజన్ కూడా ఉన్నారు. సోఫియా ముందే సౌందరరాజన్ కూర్చొని ఉండగా...ఆమెను చూసిన రీసెర్చ్ స్కాలర్ మోడీ - ఆర్ ఎస్ ఎస్ డౌన్ డౌన్.. బీజేపీ ఫాసిస్ట్ ప్రభుత్వం నశించాలి అని నినాదాలు చేశారు. ఈ స‌మ‌యంలో ఆ విద్యార్థి తల్లిదండ్రులతో కలిసి ప్రయాణం చేస్తోంది. తాను ప్రయాణిస్తున్న విమానంలోనే తమిళనాడు బీజేపీ చీఫ్‌ కూడా ఉన్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే ఏమవుతుందో చూస్తానంటూ ఆమె ట్వీట్‌ చేశారు. ఈ సమయంలో సౌందరరాజన్ వీడియో తీశారు. ఇక ట్యూటికోరిన్‌ లో విమానం ల్యాండైన వెంబడే...సోఫియాను బీజేపీ కార్యకర్తలు చుట్టుముట్టారు. సోఫియాపై సౌందరరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సోఫియాను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్‌ కు తరలించారు. ఈ సందర్భంగా సౌందరరాజన్ మాట్లాడుతూ.. సోఫియా మామూలు మనిషి కాదు. ఆమె వెనుకాల ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని ఆరోపిస్తూ సోఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే సౌందరరాజన్‌ పై కూడా సోఫియా తండ్రి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. 15రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీకి పంపారు. ఆ తర్వాత తూత్తుకుడి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

కాగా, రీసెర్చ్ స్కాల‌ర్ అయిన సోఫియా ప్ర‌ముఖ సామాజిక వేత్త‌. త‌మిళ‌నాడులో సంచ‌ల‌నం సృష్టించిన‌ స్టెరిలైట్ కాపర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా సోఫియా పోరాడారు. ఆన్‌లైన్ వేదిక‌గా, ప్ర‌త్య‌క్షంగా కూడా ఉద్య‌మాల్లో పాల్గొన్నారు. ఇలాంటి నేప‌థ్యం క‌లిగి ఉన్న సోఫియాను అరెస్ట్ చేసిన క్ర‌మంలో రాజ‌కీయ నాయకులు సైతం స్పందించారు. సోఫియాను పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ తప్పుపట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే జైల్లో పెడితే.. ఎన్ని లక్షల మందిని జైల్లో పెట్టాల్సి వస్తుందో ఊహించుకోవాలని ఆయన అన్నారు. మోడీ ప్ర‌భుత్వ విధానాల‌కు సోఫియా అరెస్ట్ తార్కాణ‌మ‌ని ఆమె మ‌ద్ద‌తు దారులు వ్యాఖ్యానించారు.