Begin typing your search above and press return to search.

మోడీ సర్కారు అమ్మే ఆస్తుల 'లెక్క' చెప్పిన కీలక అధికారి

By:  Tupaki Desk   |   17 Oct 2021 4:25 PM IST
మోడీ సర్కారు అమ్మే ఆస్తుల లెక్క చెప్పిన కీలక అధికారి
X
లాభనష్టాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటుకు కట్టబెట్టే విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాలు చూస్తున్న వారంతా నోరెళ్లబెడుతున్నారు. తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నా.. అమ్మకాల విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నట్లుగా కేంద్రం తీరు ఉంది. నష్టాలు మూటగట్టుకున్న సంస్థల్ని వదిలించుకోవటంలో అర్థం ఉంది. కానీ.. లాభాలు వస్తున్న సంస్థల్ని కూడా ప్రైవేటుకు అప్పజెప్పేయాలన్న పట్టుదలతో ఉండటం.. ఆ దిశగా ఇప్పటికే కేంద్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఇప్పటికే ఎయిరిండియా డీల్ ను విజయవంతంగా క్లోజ్ చేసిన కేంద్రం.. తాజాగా మరో రెండు దిగ్గజ సంస్థల్లో వాటాను అమ్మేయాలని భావిస్తోంది.

ఇంతకూ ఆ రెండు ఏమంటే.. ఒకటి బీపీసీఎల్ కాగా రెండోది ఎల్ఐసీ. ఈ రెండింటితో పాటు బీఈఎంఎల్.. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్.. నీలాచల్ ఇస్పాత్ నిగమ్.. పవన్ హన్స్ లలో వాటా విక్రయాలను కూడా చేపడతామని చెబుతున్నారు. ఈ కీలక విషయాల్ని వెల్లడించారు పెట్టుబడులు.. ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం కార్యదర్శి తుహిన్ కాంత పాండే.

కేంద్రం విక్రయించాలని భావిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించిన వివరాల్ని ఆయన వెల్లడించారు. ఒకేసారి పలు సంస్థల వాటాల విక్రయ ప్రక్రియ మీద తాము పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు చెప్పిన ఆయన.. అందులో భాగంగా పైన పేర్కొన్న కంపెనీల వాటాల్ని విక్రయించనున్నట్లు చెప్పారు. కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలోని వాటా విక్రయానికి మరో తొమ్మిది నుంచి పన్నెండు నెలల సమయం పడుతుందని చెప్పారు.

ఎల్ ఐసీ పబ్లిక్ ఇష్యూకు సంబంధించి మరో మూడు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని తాము భావిస్తున్నామని.. ఆ పనులు చకచకా జరుగుతున్నాయన్నారు. సెబీకి సమర్పించే ఐపీవో డీఆర్ హెచ్ఎస్ ను రూపొందించామని.. దాని విలువ లెక్క కట్టటం జరుగుతోందని.. దాని పరిణామం పెద్దది కావటంతో కాస్త ఆలస్యమవుతుందని చెప్పుకొచ్చారు. పనిలో పనిగా ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణకు సంబంధించి అప్లికేషన్లు త్వరలోనే వస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. డిసెంబరు నాటికి వస్తాయని.. అంతకు ముందు ఆర్ బీఐ లేవనెత్తిన కొన్ని అభ్యంతరాల్ని పరిష్కరించాల్సి ఉంటుందన్న మాటను చెబుతున్నారు. మొత్తంగా ప్రభుత్వ రంగానికి సంబంధించిన అన్ని సంస్థల్నివిక్రయించేందుకు భారీ ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పక తప్పదు. చూస్తుంటే.. మోడీ సర్కారు టర్మ్ పూర్తి అయ్యేసరికి.. చాలానే కంపెనీలు ప్రైవేటు పరం కావటం పూర్తి అయ్యేలా ఉందిగా.