Begin typing your search above and press return to search.

ఇప్పుడున్న మిడతల దండు అంత చిన్నదైందా?

By:  Tupaki Desk   |   17 Jun 2020 11:30 PM GMT
ఇప్పుడున్న మిడతల దండు అంత చిన్నదైందా?
X
ఎక్కడ తూర్పు ఆఫ్రికా? ఎక్కడ భారతదేశం? గ్లోబల్ మ్యాపులో చూస్తే.. వాటి మధ్య దూరం భారీగా ఉంటుంది. అలా ఆఫ్రికా నుంచి బయలుదేరి భారత్ లోకి వచ్చిన మిడతల దండు పలు రాష్ట్రాల్ని వణికించింది. ఆఫ్రికా నుంచి వచ్చే క్రమంలో తూర్పు ఆసియాలోని యెమెన్.. ఇరాన్.. పాకిస్థాన్ దేశాలు మీదుగా భారత్ లోని రాజస్థాన్ లోకి ఎంట్రీ ఇచ్చి.. తర్వాత పలు రాష్ట్రాలకు వెళ్లాయి. ఇప్పటివరకూ ఒకసారి మాత్రమే వచ్చిన ఈ మిడతల దండు.. ఈ సారి భారీగా వచ్చాయనే చెప్పాలి.

ఈ మిడతల దండు భారత్ లోకి అడుగు పెట్టే నాటికి అవెంత పెద్దవంటే? ఒక్కో మిడతల దండు 15కి.మీ. పొడవు.. 3కి.మీ. వెడల్పుతో ఉండి పంటలపై దాడి చేశాయి. ఇంత భారీ దండుతో వేలాది ఎకరాలు గంటల్లో నాశనమయ్యే పరిస్థితి. ఇలా దండెత్తిన ఈ మిడతల దండును మహారాష్ట్ర అధికారులు చీల్చటంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. తమ రాష్ట్రంలోకి అడుగు పెట్టిన మిడతల దండుపై పెద్ద ఎత్తున పురుగుల మందులు చల్లారు. ఈ ప్రభావంతో అవి కాస్తా చీలాయి. ఇప్పుడవి మూడు కిలోమీటర్ల చిన్న దండులుగా మారాయి.

మిడతల మీద అప్రమత్తంగా ఉన్న ఆయా రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం.. పిచికారీ సామాగ్రిని సిద్ధం చేసుకోవటంతో.. వీటి కారణంగా చోటు చేసుకునే ముప్పు తగ్గినట్లేనన్న అంచనా వ్యక్తమవుతోంది. తాజాగా.. వీటి సైజు కూడా తగ్గిపోవటం కూడా ఒక సానుకూలాంశమన్న మాట వినిపిస్తోంది. మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా.. ఈ దండు కానీ తెలంగాణ సరిహద్దుల్లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం వీటిని ఖతం చేసేందుకు సామాగ్రితో సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. 15వేల మెలాథియన్.. క్లోరోఫైరోపోస్.. లాంబ్డా సహాలాత్రిన్ ను అందుబాటులో ఉంచారు. పిచికారీకి అవసరమైన ఫైరింజన్లు.. జెట్టింగ్ యంత్రాల్ని సిద్ధం చేశారు. ఎప్పడైతే ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందో.. కిలోమీటరు ముందు నుంచే పిచికారీ మొదలవుతుందని చెబుతున్నారు. అదే జరిగితే.. మిగిలిన రాష్ట్రాలకు జరిగినంత నష్టం వాటిల్లే అవకాశం లేదంటున్నారు.