Begin typing your search above and press return to search.

మిడతల స్టోరీ ఇంకా ఉందా !

By:  Tupaki Desk   |   17 Jun 2020 4:15 AM GMT
మిడతల స్టోరీ ఇంకా ఉందా !
X
ఓవైపు మాయదారి రోగం. మరోవైపు విరుచుకుపడిన మిడతలదండుతో కొన్ని రాష్ట్రాలు ఆగమాగమయ్యాయి. ఈ సందట్లో.. తెలుగు రాష్ట్రాల్లోకి మిడతలు వచ్చి పడతాయన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. ఏపీలోని అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అయితే స్వల్పంగా మిడతలు వచ్చినట్లుగా కలకలం రేగింది. దీనికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పులు హడావుడి చేశాయి. అయితే.. వారు పేర్కొన్నట్లుగా.. అవేమీ దండుగా వచ్చినవి కావని అధికారులు తేల్చారు.

ఏపీ విషయం ఇలా ఉంటే.. తెలంగాణ పరిస్థితి మాత్రం అందుకు భిన్నం. మొన్నటికి మొన్న తెలంగాణ సరిహద్దుకు 200కి.మీ. వరకు మిడతల దండు వచ్చేశాయని.. ఏ క్షణంలో అయినా తెలంగాణకు వాటితో ముప్పు తప్పదన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. అధికార యంత్రాంగం సైతం అప్రమత్తమైంది. రాష్ట్ర సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే.. రావాల్సిన మిడతల దండు రాకుండా పోవటమే కాదు.. గాలి దిశ మార్చటంతో మధ్యప్రదేశ్ వైపు నుంచి వెళ్లిపోయాయి.

అయితే.. ఈ మిడతల స్టోరీ ఇక్కడితో ముగియలేదని చెబుతున్నారు. దాని ప్రమాదం పూర్తిగా తొలిగిపోలేదంటూ సీఎం కేసీఆర్ చేసిన హెచ్చరిక ఉలికిపాటుకు గురి చేయటం ఖాయం. గతంలో వచ్చిన మిడతల దండులు మహారాష్ట్ర.. మధ్యప్రదేశ్ మీదుగా వెళ్లిపోయాయని.. ప్రస్తుతం మరో దండు వార్దా సమీపానికి వచ్చినట్లుగా పేర్కొన్నారు. ఈ దండు తెలంగాణకు వచ్చే ప్రమాదం పొంచి ఉందని అలెర్టు చేశారు.

మిగిలిన వారితో పోలిస్తే.. అదిలాబాద్.. ఆసిఫాబాద్.. మంచిర్యాల.. ములుగు.. కొత్తగూడెం.. నిర్మల్.. నిజమాబాద్.. కామారెడ్డి.. సంగారెడ్డి జిల్లాలకు చెందిన అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అంతేకాదు.. మిడతల దండును ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై పక్కా వ్యూహాన్ని సిద్ధం చేయాలన్న కేసీఆర్.. ఇందులో భాగంగా ఈ రోజు (బుధవారం) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించాలని చెప్పారు. రైతును ఆగమాగం చేసే మాయదారి మిడతల దండు మీద సారు అప్రమత్తత బాగానే ఉన్నా.. కీలక అధికారుల మీద బాధ్యత వదిలే కన్నా.. ఆయనే స్వయంగా సమీక్షిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.