Begin typing your search above and press return to search.

మనకు ముప్పు తప్పినట్లే.. మిడతల దండు రూట్ మారింది

By:  Tupaki Desk   |   12 Jun 2020 10:10 AM GMT
మనకు ముప్పు తప్పినట్లే.. మిడతల దండు రూట్ మారింది
X
మాయదారి మహమ్మారితో వణుకుతున్న తెలంగాణకు.. ఈ మధ్యన మిడతలదండు ముప్పు ఉందన్న మాట తీవ్ర ఆందోళనకు గురి చేసింది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుకు కేవలం 200 కిలోమీటర్ల దూరానికి వచ్చేసిన నేపథ్యంలో మిడతల ముప్పును అధిగమించేందుకు ఏం చేయాలన్నది పెద్ద ప్రశ్నగా మారింది. కొన్ని రోజులుగా తెలంగాణ అధికారులు దీనిపై కిందామీదా పడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాయదారి రోగానికి మిడతల దండు తోడైతే.. పరిస్థితి ఆగమాగం కాక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమైంది.

లక్కీగా మిడతల ముప్పును తెలంగాణ తప్పించుకుంది. మహారాష్ట్రలోని రాంటెక్ వరకు వచ్చిన మిడతలదండు తాజాగా మధ్యప్రదేశ్ వైపు కదిలాయి. అరవై కిలోమీటర్లు ఉత్తరదిశగా ప్రయాణించిన దండు మెహాడీ గ్రామం వద్ద ఆగాయి. రాంటెక్ నుంచి దక్షిణం వైపు ప్రయాణించి తెలంగాణలోకి ప్రవేశిస్తాయన్న అంచనాతో తెలంగాణ ప్రభుత్వం సరిహద్దుల్లోని తొమ్మిది జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.

అంచనాకు భిన్నంగా.. గాలి వీస్తున్న దిశలో చోటు చేసుకున్న మార్పులతో అవి కాస్తా మధ్యప్రదేశ్ దిశగా సాగుతున్నాయి. దీంతో.. తెలంగాణకు ముప్పు తాత్కాలికంగా తప్పినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ మిడతల దండు ఎప్పుడు తమ దిశను మార్చుకుంటాయో చెప్పలేమంటున్నారు. తెలంగాణ అధికారుల అంచనా ప్రకారం మిడతల దండు ముప్పు ఇప్పడు మిస్ అయినా.. ఈ నెల 20 తర్వాత మరోసారి రాష్ట్రంలోకి ప్రవేశించే అవకావం ఉందంటున్నారు. అది కానీ తప్పించుకుంటే.. ఒక పెద్ద గండాన్ని అధిగమించినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.