Begin typing your search above and press return to search.

ఓవైపు పాజిటివ్ లు.. మరోవైపు మిడతలు.. మా పరిస్థితేమిటి సారూ?

By:  Tupaki Desk   |   11 Jun 2020 6:15 AM GMT
ఓవైపు పాజిటివ్ లు.. మరోవైపు మిడతలు.. మా పరిస్థితేమిటి సారూ?
X
కంటికి కనిపించని శత్రువు.. కనిపించకుండా ఒంట్లోకి ప్రవేశించి.. ఆగమాగం చేస్తున్న వైనం యావత్ ప్రజల్ని వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలు దేశాలకు చుక్కలు చూపించిన మాయదారి రోగం.. తెలంగాణలో మొన్నటివరకూ అదుపులో ఉన్నట్లే కనిపించింది. కానీ.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందన్న మాట అంతకంతకూ పెరుగుతోంది. ఇటీవల కాలంలో పాజిటివ్ కేసులు పెరుగుతూ కొత్త టెన్షన్ ను పుట్టిస్తున్నాయి.

ఇది సరిపోదన్నట్లుగా మండే ఎండలు పూర్తై.. వర్షాలు మొదలయ్యాయి. నలభై డిగ్రీలకు పైనే ఎండలు మండిన వేళలోనూ.. విస్తరించిన మహమ్మారి.. ముసురుపట్టి.. అక్కడక్కడా వర్షాలు పడుతున్న వేళ పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. వాతావరణం చల్లబడిన వెంటనే పలు ఆరోగ్య సమస్యలు విరుచుకుపడుతుంటాయి.

వర్షాకాలం వచ్చిందంటే పెరిగే దోమలతో పాటు.. జ్వరాలు పెరుగుతుంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో జ్వరం వస్తే వణికిపోయే పరిస్థితి. సాధారణ జ్వరం.. మహమ్మారి జ్వరమా? అన్నది తేల్చటం అంత తేలికైన విషయం కాదు. అందునా తెలంగాణలో మాయదారి రోగం వచ్చిందా? రాలేదా? అన్న నిర్దారణ పరీక్షలు ఆచితూచి అన్నట్లు నిర్వహిస్తున్న వేళ.. వర్షాకాలంలో వచ్చే జ్వరం కేసుల్ని ఎలా డీల్ చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇది సరిపోదన్నట్లుగా ఇప్పుడు మిడతల దండు సమస్య ఒకటి తెలంగాణకు తలనొప్పిగా మారింది.

మహారాష్ట్ర వైపు నుంచి దూసుకొస్తున్న ఒక మిడతల దండు తెలంగాణ రాష్ట్ర సరిహద్దువైపు కదులుతోంది. రాష్ట్ర సరిహద్దుకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దండు.. మహారాష్ట్రలోని రాంటెక్ వద్ద అజ్ని అనే గ్రామంలో ఉంది. వీటి ప్రయాణం దక్షిణం దిశగా సాగితే.. తక్కువ వ్యవధిలోనే తెలంగాణలోకి ప్రవేశించే వీలుందని చెబుతున్నారు.

అదే జరిగితే.. రాష్ట్రానికి నష్టం తప్పదన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే పెరిగిపోతున్న పాజిటివ్ కేసులు.. మరోవైపు వర్షాలు మొదలుకావటం.. ఇవి సరిపోవన్నట్లుగా మిడతలు సైతం రాష్ట్రంలోకి ఎంట్రీ ఇస్తే.. సినిమా కష్టాలకు మించిన సమస్యలు చుట్టుముట్టటం ఖాయమంటున్నారు. మరీ.. పరీక్షల్ని తెలంగాణ రాష్ట్రం ఎలా అధిగమిస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.