Begin typing your search above and press return to search.

ఒంగోలు- అనంతపురంలో లాక్ డౌన్

By:  Tupaki Desk   |   19 Jun 2020 12:30 PM GMT
ఒంగోలు- అనంతపురంలో లాక్ డౌన్
X
ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. గడిచిన 15 రోజుల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం కలవరపెడుతోంది. శుక్రవారం నాడు ఏపీలో 376 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6230కు చేరింది. ప్రత్యేకించి కొన్ని జిల్లాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో ఆయా జిల్లాల్లో, జిల్లాలోని కొన్ని నగరాల్లో సంపూర్ణ లాక్ డౌన్ విధించారు. కేసుల తీవ్రత దృష్ట్యా ప్రకాశం జిల్లా ఒంగోలులో లాక్ డౌన్ విధించారు. ఆదివారం నుంచి 14 రోజుల పాటు ఒంగోలు కార్పొరేషన్ మొత్తం కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఈ ప్రకారం అధికారులకు జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం నుంచి లాక్ డౌన్ నిబంధనలు అమలులోకి రానున్నాయి. మరోవైపు, అనంతపురం జిల్లాలో జూన్ 21 నుంచి వారం రోజులు పాటు లాక్ డౌన్ విధించనున్నట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జిల్లా ఎస్పీ ఏసుబాబు ప్రకటించారు.

శుక్రవారం ఒక్కరోజే ప్రకాశం జిల్లాలో 38 కేసులు నమోదయ్యాయి. దీంతో,ప్రకాశం జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 268కు చేరింది. 38 కేసుల్లో ఒంగోలు, చీరాలలో నమోదైన కేసులే అధికంగా ఉన్నాయి. ఒంగోలులో గత రెండు, మూడు రోజులుగా కేసులు పెరగడంతో మొత్తం కేసులు 67కి చేరాయి. గత నెలలో ప్రకాశం జిల్లాలో పాజిటివ్‌ కేసులన్నీ నెగిటివ్‌ గా మారాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే మళ్లీ కేసులు పెరగడంతో ఒంగోలులో లాక్ డౌన్ విధించారు. మరోవైపు, అనంతపురంలో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో కలెక్టర్ గంధం చంద్రుడు లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు. ముందుగా అనంతపురం, ధర్మవరం, తాడిపత్రి, యాడికి, హిందూపురం, కదిరితో పాటు కొన్ని ప్రాంతాల్లో వారం రోజులపాటు లాక్ డౌన్ విధించాలని ఆదేశాలు జారీ చేశారు. జూన్ 21 నుంచి అనంతపురం కార్పొరేషన్ పరిధిలో ఉదయం 6 నుంచి 11వరకు దుకాణాలకు అనుమతి ఉంటుంది. ఆ తర్వాత ఎవరూ రోడ్ల మీదకు రాకూడదు. అయితే, ఆర్టీసీ బస్సులు యధావిధిగా తిరుగుతాయి. టీ స్టాల్స్ పూర్తిగా మూసివేయాలి. హోటల్స్ లో ఆన్ లైన్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే పార్సిల్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఆదివారం నాడు మాంసం దుకాణాలు పూర్తిస్థాయిలో మూసి ఉంటాయి. వారం రోజుల లాక్ డౌన్ తర్వాత పరిస్థితిని బట్టి పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించే అంశాన్ని పరిశీలించనున్నారు.