Begin typing your search above and press return to search.

వామ్మో.. మ‌ద్యం లేక రోజుకు రూ.700 కోట్ల న‌ష్టం

By:  Tupaki Desk   |   17 April 2020 11:00 PM IST
వామ్మో.. మ‌ద్యం లేక రోజుకు రూ.700 కోట్ల న‌ష్టం
X
మందు అంటే యువ‌త నుంచి పెద్ద వారికి ఎంతో ఇష్టం. వారంలో క‌నీసం ఓ పెగ్‌.. ఓ బీర్ ప‌డనిది చాలామంది తాగుబోతులు ఉండ‌లేవు. ఆ విధంగా పెద్ద సంఖ్య‌లో మందు తాగేవారు చాలామందే ఉన్నారు. 130 కోట్ల జ‌నాభాలో దాదాపు 30-40 కోట్ల మంది మద్యం తాగేవారే. అయితే మందుబాబుల‌కు ఏమో కానీ ప్ర‌భుత్వాల‌కు ఆదాయం కావాలంటే మాత్రం మ‌ద్యం దుకాణాలు న‌డ‌వాల్సిందే. కొన్ని ప్ర‌భుత్వాలు ఆదాయం కోసం ప‌రోక్షంగా మ‌ద్యం వ్యాపారాన్ని ప్రోత్స‌హిస్తున్న ప‌రిస్థితులు ఉన్నాయి. మద్యం విక్ర‌యాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం వ‌స్తున్న మాట తెలిసిందే. ప్ర‌స్తుతం లాక్‌ డౌన్ వ‌ల‌న మ‌ద్యం దుకాణాలు మూత‌ప‌డడంతో ఆయా రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోతున్నాయి. అయితే దుకాణాల మూసివేత‌తో మందుబాబులు కూడా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఈ విష‌యాన్ని గుర్తించిన కొన్ని రాష్ట్రాలు త‌మ రాష్ట్రాల్లో కొన్ని ఆంక్ష‌ల‌తో మ‌ద్యం వ్యాపారానికి అనుమ‌తులు ఇస్తున్నారు.

అయితే మ‌ద్యం వ్యాపారంతో ప్ర‌భుత్వాలు కోల్పోతున్న ఆదాయం భారీగా ఉంటోంది. లాక్‌ డౌన్‌ తో 25 రోజులుగా మద్యం దుకాణాలు మూసివేయ‌డంతో జ‌రిగే నష్టం ఎంతంటే ఏకంగా రూ.700 కోట్లు. ఇది కేవ‌లం ఒక్క‌రోజుకే. ఇంత‌ మొత్తం ఆదాయం ప్రభుత్వాలు కోల్పోతున్నాయి. ఈ లాక్‌ డౌన్‌ తో దేశంలోని అన్ని రాష్ట్రాలు కలిపి దాదాపు రూ.17,500 కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు నష్ట పోయాయి. అంత పెద్ద మొత్తంలో ఆదాయం కోల్పోవ‌డం తో ప్ర‌స్తుతం కొన్ని రాష్ట్రాల్లో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జీతాలు చెల్లించలేని ప‌రిస్థితి.

తెలంగాణతో సహా అనేక పెద్ద రాష్ట్రాలు మ‌ద్యం వ్యాపారం పై తీవ్రంగా ఆధార‌ప‌డి ఉన్నాయి. యేటా రూ.20 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని మద్యం వ్యాపారంతో పొందుతున్నాయి. గతేడాది లెక్కల ప్రకారం మహారాష్ట్ర రూ.24 వేల కోట్లు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రూ.26 వేల కోట్లు - తెలంగాణ రూ.21,500 కోట్లు, కర్ణాటక రూ.20 వేల కోట్లు మద్యంతో ఆదాయం పొందాయి. ఈ లెక్క‌ల ప్ర‌కారం లాక్‌ డౌన్‌ తో తెలంగాణ దాదాపు రూ.2 వేల కోట్ల మేర నష్టపోయింది. మహారాష్ట్ర - యూపీ - కర్ణాటక కూడా భారీగానే న‌ష్ట‌పోయాయి. అయితే లాక్‌ డౌన్ కొన‌సాగుతుండ‌గా ప్ర‌జ‌లు మాత్రం మ‌ద్యం దుకాణాలు తెరిపించాల‌ని సోష‌ల్ మీడియాతో పాటు మీడియా స‌మావేశాల్లో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చేంత‌గా ప్ర‌భావితం చేస్తున్నారు.

అయితే లాక్‌ డౌన్‌ ను ప‌క‌డ్బందీగా కొన‌సాగించే ఉద్దేశంలో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం మ‌ద్యం దుకాణాలు తెరిచే విష‌య‌మై స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాలు మ‌ద్యం వ్యాపారం కొంత స‌డ‌లింపుల‌తో అమ‌లు చేయడానికి ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌గా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కేరళ ప్రజల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మ‌ద్యం విక్ర‌యాల‌కు ప్ర‌య‌త్నించ‌గా ఆ రాష్ట్ర హైకోర్టు తప్పుపట్టింది. ఇదే క్ర‌మంలో పశ్చిమ బెంగాల్ - కర్ణాటక - అస్సాం లాంటి రాష్ట్రాల ప్రయత్నాలు చేయ‌గా అమ‌ల్లోకి రాలేదు.

మద్యం విక్ర‌యాలను అనుమతించొద్దని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఎక్సైజ్ రాష్ట్రాలకు సంబంధించిన అంశమే అయినా జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద త‌మ‌ ఆదేశాలను పాటించాల‌ని ఆదేశాలు జారీ చేయ‌డంతో మ‌ద్యం వ్యాపారం లాక్‌ డౌన్ త‌ర్వాత‌నే పునఃప్రారంభం కానుంది.

గతేడాది లెక్కల ప్రకారం మ‌ద్యం ఆదాయం
మహారాష్ట్ర రూ.24 వేల కోట్లు
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రూ.26 వేల కోట్లు
తెలంగాణ రూ.21,500 కోట్లు
కర్ణాటక రూ.20 వేల కోట్లు