Begin typing your search above and press return to search.

తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు.. ఎప్పటిదాకంటే?

By:  Tupaki Desk   |   30 May 2021 2:34 PM GMT
తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు.. ఎప్పటిదాకంటే?
X
తెలంగాణలో లాక్ డౌన్ పై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మరో 10 రోజుల పాటు తెలంగాణలో లాక్ డౌన్ ను పొడిగిస్తూ తాజాగా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా ఇబ్బందులున్నా.. పేదలు, మధ్యతరగతి వారు ఆదాయం కోల్పోతున్నా సరే ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకొని లాక్ డౌన్ ను పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి మరో 10 రోజుల పాటు తెలంగాణలో లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అయితే లాక్ డౌన్ నుంచి ప్రజలకు కాస్త మినహాయింపులను ఇచ్చారు. లాక్ డౌన్ సడలింపు సమయాన్ని మూడు గంటలు పెంచారు. ఇప్పటివరకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే సడలింపు ఇస్తుండగా దాన్ని మధ్యాహ్నం 1 గంట వరకు పొడిగించారు. సడలింపు సమయం తర్వాత బయటికి వెళ్లిన ప్రజలు ఇళ్లకు చేరుకోవడానికి మరో గంట పాటు అదనపు సమయం ఇచ్చారు. దీంతో మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కఠిన లాక్ డౌన్ అమల్లోకి రానుంది.

అత్యవసర సేవలు సహా ప్రభుత్వం గతంలో వెల్లడించిన కార్యకలాపాలకు లాక్ డౌన్ నుంచి యథావిధిగా మినహాయింపు కొనసాగనుంది.

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 12 నుంచి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈరోజుతో గడువు ముగియడంతో సీఎం కేసీఆర్, కేబినెట్ మంత్రులు అన్ని వర్గాల అభిప్రాయాలు తెలుసుకొని మరో 10 రోజుల పాటు లాక్ డౌన్ ను పొడిగించారు.