Begin typing your search above and press return to search.

లాక్ తీయొచ్చన్న మోడీ మాట ప్రాక్టికల్ గా సాధ్యమేనా?

By:  Tupaki Desk   |   15 April 2020 9:15 AM IST
లాక్ తీయొచ్చన్న మోడీ మాట ప్రాక్టికల్ గా సాధ్యమేనా?
X
జాతిని ఉద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగంలో కీలక వ్యాఖ్య ఒకటి చేశారు. కరోనా ముప్పు తీవ్రత లేని ప్రాంతాల్లో ఏప్రిల్ 20 తర్వాత కొన్ని అవసరమైన కార్యకలాపాల్ని షరతులతో.. కఠిన నిబంధనలతో అనుమతి ఇస్తామన్న మాట కొత్త చర్చకు తెర తీసింది. మే మూడు వరకూ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లుగా నిర్ణయాన్ని వెల్లడించిన ప్రధాని మాట కొత్త ఆశలు పుట్టిస్తున్నా.. ప్రాక్టికల్ గా అమలు సాధ్యమేనా? అన్నది క్వశ్చన్.

షరతులతో లాక్ డౌన్ సడలిస్తామన్న మోడీ మాట వినేందుకు బాగానే ఉన్నా.. దాన్ని అమలు అంత తేలిక కాదని చెప్పాలి. ఉదాహరణకు హైదరాబాద్ మహానగరాన్ని తీసుకుంటే.. ఇందులో ముప్ఫై సర్కిళ్లు ఉన్నాయి. అందులో ఎల్ బీ నగర్.. హయత్ నగర్ సర్కిళ్లలో ఇప్పటివరకూ ఒక్కటంటే ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు. మోడీ మాటను పరిగణలోకి తీసుకొని.. ఆ రెండు సర్కిళ్లలో పరిమితులతో కూడిన లాక్ డౌన్ ను ఎత్తేయొచ్చా? అన్నది ప్రశ్న.

ప్రధాని సూచనను ఫాలో అయి.. లాక్ డౌన్ తాళం తీసేస్తే.. ఆ వెంటనే ఏం జరుగుతుందన్నది ప్రశ్న. ఈ రెండు సర్కిళ్ల ప్రజలు తమ ఇళ్లల్లో నుంచి బయటకు రావొచ్చు. కానీ.. ఆ వెంటనే ఎల్ బీ నగర్ పక్కనే ఉన్న మలక్ పేటకు.. పొరుగునే ఉన్న ఉప్పల్ లాంటి ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ రెండు ప్రాంతాల్లోనూ కరోనా కేసులు నమోదై ఉన్నాయి. ఇలాంటప్పుడు లాక్ డౌన్ ఆంక్షలు సడలిస్తే ఇబ్బందులు ఎదురవుతాయన్న మాట వినిపిస్తోంది.

హైదరాబాద్ ను వదిలేసి.. జిల్లాలకు ఇదే విధానాన్ని అమలు చేసినా ఇబ్బందులు తప్పవంటున్నారు. ఏపీలోని ప్రకాశం.. నెల్లూరు జిల్లాల్నే తీసుకుంటే.. నెల్లూరులో కేసులు లేవనే అనుకుందాం. ఆ జిల్లాలో ఆంక్షలు ఎత్తి వేసిన మరుక్షణం ఆ జిల్లా ప్రజలు పక్కనే ఉన్న ప్రకాశం జిల్లాకు కానీ.. పొరుగునే ఉన్న తమిళనాడుకు ప్రయాణం అయ్యే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే.. నెల్లూరు జిల్లా తనకు తానుగా రోజువారీ కార్యకలాపాల్ని సొంతంగా నిర్వహించుకోలేని పరిస్థితి. వ్యాపారం కావొచ్చు.. ఇతర అంశాల మీద తనకు రెండు వైపులా ఉన్నా మిగిలిన జిల్లాలతో ఏదో ఒక సంబంధం పక్కాగా ఉంటుంది.

ఈ నేపథ్యంలో ఏదైనా జిల్లాలో కరోనా కేసు నమోదు కాని వేళ.. దాని పక్కనున్న జిల్లాల్లోనూ కరోనా కేసులు ఖతం పట్టించే వరకూ లాక్ డౌన్ ను ఎత్తివేయకుండా ఉండటమే మంచిదని చెప్పాలి. లాక్ డౌన్ ఎత్తేసిన మరుక్షణం ప్రజల్ని కంట్రోల్ చేయటం అంత తేలికైన విషయం కాదు. ఒకవేళ నియంత్రించే ప్రయత్నం చేస్తే.. ప్రజల నుంచి వ్యతిరేకత రావటంతో పాటు.. కొత్త సమస్యలకు కారణమవుతుంది. అందుకే.. లాక్ డౌన్ ఎత్తివేసే విషయంలో ఏ మాత్రం తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకూడదు.