Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: దేశంలో మే3 వరకు లాక్ డౌన్ పొడిగింపు

By:  Tupaki Desk   |   14 April 2020 10:35 AM IST
బ్రేకింగ్: దేశంలో మే3 వరకు లాక్ డౌన్ పొడిగింపు
X
కరోనా వైరస్ దేశంలో విస్తరిస్తుండడం.. రోజురోజుకు కేసులు పెరుగుతుండడం.. తీవ్రత తగ్గక పోవడంతో దేశంలో లాక్ డౌన్ ను మరో 19 రోజులు పొడిగిస్తూ ప్రధాని నరేంద్రమోడీ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం జాతినుద్దేశించిన ప్రసంగించిన ప్రధాని మోడీ మే 3 వరకు భారత్ లో లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.

పరిస్థితి తీవ్రత దృష్ట్యానే లాక్ డౌన్ ను దేశంలో పొడిగించామని మోడీ తెలిపారు. తనకు భారత దేశ ఆర్థిక వృద్ధి కంటే భారతీయుల ప్రాణాలే ముఖ్యమని పునరుద్ఘాటించారు.

ఇక రెడ్ జోన్, హాట్ స్పాట్లు మినహా కరోనా లేని ప్రాంతాల్లో ఏప్రిల్ 20 నుంచి ప్రజలకు కాస్తా వెసులుబాటు ఇస్తున్నట్టు మోడీ ప్రకటించారు. ఏప్రిల్ 20 వరకు లాక్ డౌన్ మరింత తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇక మే 3 తర్వాత కూడా కరోనా ప్రాంతాల్లో నిబంధనలు పాటిస్తామని తెలిపారు.

కరోనా తీవ్రత నేపథ్యంలో రేపు మరిన్ని కఠిన నిబంధనలను అమలు చేస్తామని మోడీ తెలిపారు. ఈ వారం ఇండియాకు మరింత గడ్డు కాలమని మోడీ ప్రకటించారు. ఏప్రిల్ 20 తర్వాత కొంత సడలింపు ఇస్తామని తెలిపారు.

లాక్ డౌన్ తో ప్రజలు తినడానికి, నిత్యావసరాలకు ఇబ్బంది కలుగుతోందని.. అయినా ప్రాణాలు కాపడడానికి లాక్డౌన్ పొడిగించడం అనివార్యమన్నారు.

కరోనా వ్యాక్సిన్ కోసం మన శాస్త్రవేత్తలు పోరాడుతున్నారని.. దేశంలోని వైద్యులు, నిపుణులు, అందరి అభిప్రాయాలు తీసుకునే మే 3వరకు లాక్ డౌన్ పొడిగించామని తెలిపారు.

ఇక భారత్ లో ప్రజలంతా ఒక్కతాటికి వచ్చి లాక్ డౌన్ విజయవంతం చేశారని.. విదేశాల్లోని జనాలు అది పాటించక మరణమృదంగం కొనసాగిందని.. మన భారతీయుల ఐక్యతకు ప్రపంచమే ఫిదా అయ్యిందని మోడీ కొనియాడారు.

ఇక బౌతిక దూరం పాటించాలని.. సప్తపది సూత్రాలను మోడీ ప్రకటించారు. వృద్ధులు, అన్నార్థులు, పేదలకు సాయం చేయాలని సూచించారు. వృద్దులు, పిల్లలను కాపాడుకోవాలన్నారు. ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని పాటించాలని మోడీ సూచించారు. మాస్కులు అందరూ ధరించాలన్నారు.

ఇక ప్రైవేటు సంస్థ తమ ఉద్యోగులపై వేటు వేయవద్దని.. అందరినీ ఈ రెండు నెలలు కాపాడుకోవాలని మోడీ సూచించారు.