Begin typing your search above and press return to search.

ఈ ఏడాది ఖైరతాబాద్ 'గణేష్' విగ్రహం ఎత్తు తెలిస్తే షాక్

By:  Tupaki Desk   |   12 May 2020 6:00 PM IST
ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఎత్తు తెలిస్తే షాక్
X
కరోనా పేరు చెబితే ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్నాయి. కరోనా బారిన పడకుండా ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికే మనుషులతోపాటు దేవుళ్లకూ కరోనా సెగ తగిలిన సంగతి తెలిసిందే. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల శ్రీవారి ఆలయంలో ఓ పక్క నిత్యనైవేద్య దీపధూపాలు జరుగుతున్నా...మరోపక్క ఆదాయం పడిపోయింది. ఇక, తాజాగా కరోనా ప్రభావం ఖైరతాబాద్ గణేష్ విగ్రహంపై పడింది. కరోనా దెబ్బకు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే గణేష్ నిమజ్జన వేడుకలు....వెలవెలబోనున్నాయి. దీంతోపాటు, ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఎత్తును ఒక అడుగుకు తగ్గిస్తూ ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహంపై కరోనా ప్రభావం పడింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా పేరు గాంచిన ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం ఎత్తును తగ్గించాలని కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది వినాయకచవితి సందర్భంగా కేవలం ఒక్క అడుగు ఎత్తున్న విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్టించాలని కమిటీ నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో భారీ ఎత్తు విగ్రహ ఏర్పాటు నిర్ణయాన్ని కమిటీ విరమించుకుంది. దీంతోపాటు, భారీ విగ్రహ నిర్మాణానికి నిర్వహించే కర్ర పూజను కూడా కమిటీ రద్దు చేసింది. మే 18న కర్ర పూజ చేసి శాస్త్రోక్తంగా విగ్రహ తయారీ చేపట్టాలని భావించినప్పటికీ.. కరోనా నేపథ్యంలో ఆ ఆలోచన విరమించుకుంది.

అయితే, పోలీసులు అనుమతి వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సుదర్శన్ తెలిపారు. వాస్తవానికి ఈ ఏడాది18 తలలతో విశ్వరూప వినాయకుడు ప్రతిష్టించాలని అనుకున్నామని, కానీ, కరోనా వల్ల షెడ్యూల్ తారుమారైందని అన్నారు. ఈ ఏడాది కేవలం ఒక్క అడుగుతో పక్కనే ఉన్న ఆలయంలో విగ్రహం ఏర్పాటు చేసుకుంటామని, కరోనా వ్యాప్తి తగ్గితే భారీ వినాయకుడిని ప్రతిష్టించే ఆలోచన చేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర పోలీస్ అధికారులను కలిసిన తర్వాత తమ నిర్ణయం ప్రకటిస్తామన్నారు.