Begin typing your search above and press return to search.

లాక్‌ డౌన్ ఎఫెక్ట్ మద్యం హోం డెలివరీ.. ఆ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   10 May 2021 3:13 PM IST
లాక్‌ డౌన్ ఎఫెక్ట్ మద్యం హోం డెలివరీ.. ఆ రాష్ట్ర సర్కార్  కీలక నిర్ణయం
X
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో , కరోనాను కట్టడి చేయడంలో భాగంగా పలు రాష్ట్రాలు లాక్‌ డౌన్‌, కర్ఫ్యూను అమల్లోకి తీసుకువచ్చాయి. రెండో దశలో కరోనా వైరస్ తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో చత్తీస్‌ గడ్‌ లోనూ లాక్‌ డౌన్‌ కఠినంగా అమలు చేస్తున్నారు. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. అయితే, మద్యం మాత్రం హోం డెలివరీ చేవేస్తామని చత్తీస్‌ గఢ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆన్‌ లైన్‌ లో బుక్‌ చేసుకున్న వారికి మద్యం ఇంటికే అందిస్తామని చేసిన ప్రభుత్వ ప్రకటనపై ప్రతిపక్ష బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగడంతో మద్యం దుకాణాలను మూసివేశారు. ఈ సమయంలో మద్యం ఆన్‌ లైన్‌ ద్వారా బుక్‌ చేసుకునే వారికి నేరుగా హోం డెలివరీ చేయవచ్చని ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ కు ప్రభుత్వం ఆదివారం అనుమతి ఇచ్చింది.

ఈ నియమాలు మే 10 నుంచి అమల్లోకి రానున్నాయి. ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు హోం డెలివరీ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ సమయాన్ని స్థానిక పరిస్థితులను బట్టి జిల్లా అధికారులు మార్చుకోవచ్చని తెలిపింది. లాక్‌ డౌన్‌ సమయంలో మద్యం అక్రమ తయారీ, అమ్మకం, రవాణా వంటిని కట్టడి చేసేందుకు హోం డెలివరీకి అనుమతి ఇచ్చినట్లు ఎక్సైజ్‌ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. వెబ్‌ సైట్‌లో ముందస్తుగా నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో కస్టమర్‌ కు గరిష్ఠంగా ఐదు లీటర్ల మద్యాన్ని సరఫరా చేస్తారు. డెలివరీ ఛార్జ్ కింద అదనంగా రూ.100 చెల్లించాలి. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ మండిపడుతోంది. ఇది బాధ్యతరహిత్య, అసంబద్ధమైన నిర్ణయమని దుయ్యబట్టింది. ఆక్సిజన్, వ్యాక్సిన్ సహా అత్యవసర ఔషధాలు కొరతపై దృష్టపెట్టకుండా మద్యం హోం డెలివరీకి అనుమతించడం ఏంటని ప్రశ్నిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఔషధాలు అవసరం.. మద్యం కాదు.. కానీ, ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడని సిగ్గుమాలిన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఆరాటమంతామద్యంపై కమిషన్ల కోసమే.. సాధారణ ప్రజల కోసం కాదు అని చత్తీస్‌ గఢ్ బీజేపీ అధికార ప్రతినిధి గౌరీ శంకర్ శ్రీవాస్ అన్నారు.