Begin typing your search above and press return to search.

దేశ వ్యాప్తంగా కఠినమైన లాక్ డౌన్ మరోసారి తప్పదా?

By:  Tupaki Desk   |   11 Jun 2020 2:00 PM GMT
దేశ వ్యాప్తంగా కఠినమైన లాక్ డౌన్ మరోసారి తప్పదా?
X
మాయదారి రోగం ముంచుకొచ్చిందంటూ మార్చి 22న దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను విధించటం తెలిసిందే. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి ఒక రోజు ముందుగానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ను విధించారు. చూస్తున్నంతనే లాక్ డౌన్ 1.0 కాస్తా 5.0కు చేరుకుంది. రోజులు గడిచే కొద్దీ.. లాక్ డౌన్ పొడిగింపుల కారణంగా కొత్త కొత్త సమస్యలు తెర మీదకు రావటమే కాదు.. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. దీంతో.. ఆర్థిక పరిస్థితిని కాస్త కుదుట పడేలా చేయటం కోసం లాక్ డౌన్ సడలింపులు చేపట్టారు.

ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా పలు రంగాలకుసడలింపుల్ని ఇస్తూ కేంద్రం.. ఆయా రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకున్నారు. లాక్ డౌన్ ను అన్ లాక్ చేసిన తర్వాత నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య జెట్ స్పీడ్ తో దూసుకెళుతున్నాయి. ఇప్పుడు రోజువారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య పదివేలకు చేరుకున్నాయి (బుధవారం ఒక్కరోజు నమోదైన పాజిటివ్ కేసులు 9,985). ఇదే లెక్కన మరికొన్ని రోజులు సాగితే కేసుల తీవ్రత మరింత పెరగటం ఖాయం.

ప్రస్తుతం 2.76 లక్షలకు చేరుకున్న పాజిటివ్ కేసులు.. జులై నెలాఖరుకు భారీగా నమోదు కావటం ఖాయమన్న ఆందోళన ఎక్కువ అవుతుంది. ఒక అంచనా ప్రకారం ఢిల్లీలో కనుక ఇప్పుడున్న పరిస్థితులు ఇదే తీరులో కొనసాగితే.. జులై 31 నాటికి 1.5లక్షల కేసులు నమోదు కావటం ఖాయమంటున్నారు. ఒక రాష్ట్రంలోనే తీవ్రత ఇలా ఉంటే.. మిగిలిన రాష్ట్రాల సంగతి ఇందుకుభిన్నంగా ఉండే అవకాశం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి లాక్ డౌన్ తప్పదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఓవైపు నీరసించిన ఆర్థిక వ్యవస్థ.. మరోవైపు కేసుల తీవ్రత నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకున్నా సమస్యలేనన్న మాట వినిపిస్తోంది. మాయదారి రోగానికి మించిన సమస్య ఆర్థిక సమస్యగా అభివర్ణించేవారు లేకపోలేదు. ప్రజలు నియంత్రణతో వ్యవహరిస్తూ.. ఆచితూచి అన్నట్లుగా నిర్ణయాలు తీసుకుంటే తప్పించి పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదంటున్నారు. పరిస్థితి మరింత దిగజారితే.. తప్పనిసరి పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా కఠిన లాక్ డౌన్ దిశగా నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు.

ఈ వాదనకు బలం చేకూరేలా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే హెచ్చరికను ప్రస్తావిస్తున్నారు. ప్రజలు నియమాల్ని పాటించకుంటే లాక్ డౌన్ తప్పదని ఆయన పేర్కొన్నారు. దేశంలో పెరిగే కేసులకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. ఒకవేళ.. తిరిగి లాక్ డౌన్ విధిస్తే మాత్రం.. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కోల్పోవటం ఖాయమన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఊహించుకోవటానికే కష్టంగా ఉన్న ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనే సామర్థ్యం మనకుందా? అన్నది అసలు ప్రశ్న. అందుకే.. ఎవరికి వారు నియంత్రణతో వ్యవహరిస్తే సరిపోతుంది.