Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ ఎఫెక్ట్ .. కిక్కిరిసిన మార్కెట్లు

By:  Tupaki Desk   |   20 April 2021 5:30 AM GMT
లాక్ డౌన్ ఎఫెక్ట్ .. కిక్కిరిసిన మార్కెట్లు
X
కరోనా సెకండ్ వేవ్ దేశంలో అలజడి రేపుతోంది. మళ్లీ మునుపటి కంటే ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ , వీకెండ్ లాక్ డౌన్, కర్ఫ్యూ వైపు అడుగులు వేస్తున్నాయి. ఇక కొరోనా కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం ఆరు రోజులు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీనితో ప్రజలు పెద్ద ఎత్తున నిత్యావసరాల కొనుగోళ్లకు దిగారు. పలు ప్రాంతాల్లో మార్కెట్లు, మద్యం దుకాణాలు, మాల్స్‌ వద్ద భారీ క్యూలైన్లు కనిపించాయి. లాక్ ‌డౌన్‌ వేళ బయటకు రాకుండా ఉండాలంటే ఇంట్లో అన్నీ సిద్దంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రజలు షాపింగ్ ‌కు ఒక్కసారిగా బయటకి వచ్చారు. ఈనెల 26 సాయంత్రం 5గంటల వరకు లాక్ ‌డౌన్‌ ఉంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీనితో ఎలాగైనా కొన్ని సరుకులు కొందామని భావిస్తున్న సామాన్య ప్రజలు ఈ ప్రకటనతో ఒక్కమారుగా పెద్ద ఎత్తున సరుకుల కొనుగోళ్లకు దిగారు. ఏడాది దాటిపోతున్నా కూడా కరోనా లో ఏ మాత్రం మార్పు రాలేదని, ఎమర్జెన్సీ వేళల్లో ప్రభుత్వాన్ని నమ్మలేమని, అందుకే సంసిద్ధంగా ఉండేందుకు నిత్యావసరాలను కొనుగోలు చేస్తున్నామని ప్రజలు చెప్తున్నారు. ప్రజల్లో లాక్ ‌డౌన్‌ ప్రకటన కారణంగా భయాందోళన నెలకొందని, అందుకే ఇలా మూకుమ్మడి కొనుగోళ్లకు దిగారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రజల్లో నెలకొన్న భీతిని క్యాష్‌ చేసుకునేందుకు కొందరు వ్యాపారస్తులు యత్నిస్తున్నారని ప్రజలు ఆరోపించారు. చాలా షాపుల్లో వస్తువుల ధరలు ఒక్కసారిగా పెంచేశారని మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇలాంటి వారిని అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఒకవేళ లాక్ ‌డౌన్‌ పొడిగిస్తే మధ్యతరగతి పరిస్థితి దారుణంగా తయారవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డీడీఎంఏ ఆదేశాల ప్రకారం లాక్‌ డౌన్‌ సమయంలో అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయి. మాల్స్, జిమ్స్, ఉత్పత్తి యూనిట్లు, విద్యాసంస్థలు, సినిమాహాల్స్, రెస్టారెంట్లు, బార్లు, పబ్లిక్‌పార్కులు, స్పా మరియు బార్బర్‌ షాపులు మూసేయాలి.