Begin typing your search above and press return to search.

టీఆరెస్ లో లోకల్-నాన్ లోకల్ ఫైట్

By:  Tupaki Desk   |   31 Oct 2016 5:08 AM GMT
టీఆరెస్ లో లోకల్-నాన్ లోకల్ ఫైట్
X
తెలంగాణ రాకముందు నుంచి ఉద్యోగులకు సంబంధించి - నియామకాలకు సంబంధించి నానుతున్న లోకల్ - నాన్ లోకల్ అంశం ఇప్పుడు టీఆరెస్ పార్టీలోనూ కనిపిస్తోంది. అయితే.. అప్పుడు తెలంగాణ ప్రజలు లోకల్ - ఆంధ్రప్రజలు నాన్ లోకల్ కాగా ఇప్పుడు లోకల్ - నాన్ లోకల్ రెండూ తెలంగాణవారే. అవును.. టీఆరెస్ లో లోకల్ - నాన్ లోకల్ రచ్చ నడుస్తోందట. కొత్త జిల్లాలకు కమిటీలు వేయనున్న తరుణంలో పార్టీలో ఎవరు మొదటి నుంచి ఉన్నారు.. ఎవరు బయట నుంచి వచ్చారన్న ప్రస్తావన పెరుగుతోంది. దీంతో ఎన్నికలకు ముందు నుంచి టీఆరెస్ లో ఉన్నవారిని లోకల్ గా... ఎన్నికల తరువాత ఇతర పార్టీల నుంచి ఫిరాయించినవారిని నాన్ లోకల్ గా కొందరు పేర్కొంటున్నారు.

తెలంగాణలో కొత్త జిల్లాలకు పార్టీ క‌మిటీలు నియ‌మించ‌డానికి టీఆరెస్ రెడీ అవుతోంది. ఇందుకోసం ఆయా జిల్లాల్లోని పార్టీ నాయ‌కుల పేర్లను ప‌రిశీలిస్తోంది. అయితే.. ఇక్కడే పార్టీకి ఓ స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. మొద‌టి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉంటూ టీఆర్ ఎస్ కోసం ప‌నిచేస్తున్నవారికి- ఇత‌ర పార్టీల నుంచి గెలిచి గులాబీపార్టీలోకి చేరిన వారి మ‌ధ్య ఆధిప‌త్యపోరు న‌డుస్తోంది. వీరిలో ఎవ‌రికి ప‌ద‌వులు ద‌క్కుతాయ‌న్న విష‌యంలో ఉత్కంఠ నెల‌కొంది. మొద‌టి నుంచి పార్టీలో ఉన్నవారు - ఎన్నిక‌ల‌కుముందు - ఎన్నిక‌ల త‌రువాత ఇలా సీనియారిటీ ప్రకారం.. ఎవ‌రికి వారు పార్టీ ప‌ద‌వుల‌పై క‌న్నేశారు. కొత్త జిల్లాల్లో ప‌దవుల కేటాయింపులో పార్టీ ఎవ‌రికి పెద్ద పీట వేస్తుంద‌న్నది చ‌ర్చానీయాంశంగా మారింది.

టీఆర్ ఎస్ అధికారంలోకి వ‌చ్చాక చాలామంది ఇత‌ర పార్టీల నుంచి వ‌ల‌స వ‌చ్చారు. వారి అనుచ‌రులు కూడా గులాబీతీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో త‌మ ఆధిప‌త్యాన్ని చాటుకోవడానికి వ‌ల‌స నాయ‌కులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొత్త జిల్లాల పార్టీ ప‌ద‌వుల నియామకంలో త‌మ అనుచ‌రుల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని అధిష్టానానికి విన్నవించుకుంటున్నారు. మ‌రోవైపు మొద‌టి నుంచి పార్టీలో ఉన్న చాలామంది ఇప్పుడు ఎంపీ - ఎమ్మెల్యే - మంత్రుల హోదాలో ఉన్నారు. ఈ నాయ‌కుల‌కు – వ‌ల‌స వ‌చ్చిన నాయ‌కుల‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే స్థాయిలో విభేదాలు ఉన్నాయి. నియోజ‌క‌వ‌ర్గాల్లో అభివృద్ధి ప‌నుల విష‌యంలోనూ వ‌ల‌స నాయ‌కులు - పార్టీ నాయ‌కులు ఎవ‌రికి వారు శంకుస్థాప‌న‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త జిల్లాల ప‌ద‌వుల నియామ‌కంలో పార్టీ ఎవ‌రికి ప్రాధాన్యం ఇస్తుంద‌న్నది ఇప్పుడు ఆస‌క్తికరంగా మారింది.టీడీపీ నుంచి దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు కారెక్కారు. వీరిలో ఎక్కువ భాగం గ్రేట‌ర్ ప‌రిధిలోనే ఉన్నారు. ఇక‌పోతే ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు - ఎంపీలు చామ‌కూర మ‌ల్లారెడ్డి - గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి - పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డిల‌కు కూడా వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో స్థానిక నాయ‌కుల‌తో అస్సలు పొస‌గ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో పార్టీ ఎవ‌రికి ప్రాధాన్యం ఇస్తుంది? వ‌ల‌స నాయ‌కుల‌కా? సొంత నేత‌ల‌కా అన్నది మ‌రో మూడునాలుగు రోజుల్లో తేలిపోనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/