Begin typing your search above and press return to search.

స‌భ‌లో లైవ్ క‌ట్‌..సుప్రీం విచార‌ణ‌లో లైవ్‌..?

By:  Tupaki Desk   |   24 July 2018 4:42 AM GMT
స‌భ‌లో లైవ్ క‌ట్‌..సుప్రీం విచార‌ణ‌లో లైవ్‌..?
X
గ‌డిచిన కొంత‌కాలంగా జ‌రుగుతున్న చ‌ర్చ ఒక‌టి తాజాగా కార్య‌రూపం దాల్చ‌నుందా? అంటే అవున‌నే మాట వినిపిస్తోంది. సుప్రీంకోర్టులో విచారించే రాజ్యాంగ‌ప‌ర‌మైన అంశాలను లైవ్ ద్వారా అందించాల‌న్న సుప్రీంకోర్టు నిర్ణ‌యానికి సానుకూల‌త వ్య‌క్త‌మ‌వుతోంది. సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం తాజాగా విచార‌ణ‌ను లైవ్ టెలికాస్ట్ చేసే అంశంపై పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు.

సాంకేతికంగా ఈ అంశం ఎలా ప‌ని చేస్తుంద‌న్న విష‌యాన్ని మూడు నెల‌ల పాటు ప‌రిశీలించి.. ఆ త‌ర్వాత మ‌రింత స‌మ‌ర్థంగా మార్చాల‌న్న మాట‌ను చెప్పారు. ఇదిలా ఉంటే.. కేంద్రం సైతం లైవ్ కు ఓకే చెప్పింది. కేసుల విచార‌ణను వీడియోల‌లో షూట్ చేయ‌టం.. వాటిని లైవ్ టెలికాస్ట్ చేయ‌టంపై పైల‌ట్ ప్రాజెక్టు రూప‌క‌ల్ప‌నపై ఏజీ సాయాన్ని కోర్టు కోర‌టం తెలిసిందే.

తాజాగా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాల అవ‌స‌ర‌మేన‌ని ఈ నెల 9న సుప్రీం ధ‌ర్మాస‌నం అభిప్రాయ‌ప‌డింది. అత్యాచారం లాంటి కేసులు మిన‌హాయించి మిగిలిన కేసు విచార‌ణ అంశాల్ని లైవ్ టెలికాస్ట్ చేసే దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి. లైవ్ కు సంబంధించి మ‌రికొంద‌రి అభిప్రాయాన్ని సేక‌రించి.. స‌మగ్రంగా ఈ విష‌యాన్ని ప‌రిశీలించాల‌ని సుప్రీం భావిస్తోంది. ఇందుకు వీలుగా ఈ నెల 30 వ‌ర‌కూ ఈ కేసు విచార‌ణ‌ను వాయిదా వేశారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. చ‌ట్ట‌స‌భ‌ల కార్య‌క‌లాపాల్ని లైవ్ ద్వారా అందించే అవ‌కాశం ఉన్నా.. ప్ర‌త్యేక హోదా కోసం ఏపీ ఎంపీలు ఆందోళన చేస్తున్న తీరుపై ఆగ్ర‌హం చెందిన ఉప‌రాష్ట్రప‌తి రాజ్య‌స‌భ లైవ్ ను 19 నిమిషాల పాటు ఆపించిన‌ట్లుగా తెలిసిందే. ఇది జ‌రిగిన రోజునే.. సుప్రీంకోర్టు త‌న వాద‌న‌ల్ని లైవ్ లోకి తీసుకొచ్చేందుకు కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకోవ‌టం విశేషంగా చెప్పాలి.