Begin typing your search above and press return to search.

5 కి.మీలు.. 10 నిమిషాలు.. ఆ గుండెను బతికించారు

By:  Tupaki Desk   |   10 Aug 2019 12:13 PM IST
5 కి.మీలు.. 10 నిమిషాలు.. ఆ గుండెను బతికించారు
X
ఒక ప్రాణాన్ని బతికించేందుకు పోలీసులు, వైద్యులు పడిన తపనకు ఫలితం దక్కింది. ఒక గుండెను బతికించేందుకు సాహసమే చేశారు. మామూలుగా 25 నిమిషాల వ్యవధి పట్టే దూరాన్ని ‘గ్రీన్ చానెల్’ ఏర్పాటు చేసి 10 నిమిషాల్లో తరలించి ఒకరికి ప్రాణదానం చేశారు.

బ్రెయిన్ డెడ్ అయిన మహిళ నుంచి సేకరించిన గుండెను ఓ 18 ఏళ్ల యువతికి అమర్చేందుకు కేర్ ఆస్పత్రి వైద్యులు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను సాయం కోరారు. దీనికి పోలీసులు సమ్మతించి మొత్తం ట్రాఫిక్ ను కంట్రోల్ చేసి ‘గ్రీన్ చానెల్’ ఏర్పాటు చేశారు. రాత్రి 8.08 గంటలకు అంబులెన్స్ లో తరలించి 8.18 నిమిషాలకు లక్ష్యాన్ని చేర్చారు.

బంజరాహిల్స్ లోని కేర్ ఆస్పత్రి నుంచి నాంపల్లిలోని కేర్ ఆసుపత్రి. 5 కి.మీల దూరం.. మామూలుగా అయితే 25 నిమిషాల టైం పోవడానికి పడుతుంది. కానీ పోలీసులు గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసి ఎస్కార్ట్ గా పోలీస్ జీపును ఉంచారు. ట్రాఫిన్ ను నిలిపివేసి అంబులెన్స్ లో ప్రత్యేక మార్గం ద్వారా గుండెను తరలించారు. కేర్ ఆస్పత్రిలో హృద్రోగంతో బాధపడుతున్న 18 ఏళ్ల యువతికి ఆపరేషన్ తో అమర్చి ప్రాణం పోశారు.. హైదరాబాద్ పోలీసులు ఇప్పుడే కాదు.. గడిచిన రెండేళ్లలో ఇలా 3 సార్లు అవయవాలను తరలించడంలో సహకరించి మానవత్వం చాటారు.

హైదరాబాద్ లోని గాంధీనగర్ కు చెందిన ఏ. సరిత అధిక రక్తపోటుకు గురై ఇంట్లో తూలిపడ్డారు. కుటుంబసభ్యులు హుటాహుటిన కుటుంబ సభ్యులు బంజరాహిల్స్ కేర్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె తలలో రక్తనాళాలు చిట్లిపోయి రక్తస్రావం జరిగిందని తేల్చారు. చికిత్స చేసినా ఫలితం లేక ఆమె బ్రెయిన్ డెడ్ అయిపోయింది. దీంతో ఈ విషయాన్ని వైద్యులు జీవన్ దాన్ ట్రస్ట్ కు సమాచారం అందించారు. వాళ్లు ఆస్పత్రికి వచ్చి సరిత భర్త వినల్ కుమార్ తో మాట్లాడి అవయవ దానానికి ఒప్పించారు. ఆయన ఒప్పుకోవడంతో సరిత రెండు మూత్రపిండాలు, కాలేయం, కార్నియా ఇతర అవయావాలు సేకరించారు. గుండెను కేర్ లో గుండె ఫెయిల్ అయిన అమ్మాయికి అమర్చి ప్రాణదానం చేశారు.