Begin typing your search above and press return to search.

మోడీ సర్కారు వైఫల్యాల చిట్టా తెలుసుకోవాలని ఉందా?

By:  Tupaki Desk   |   3 July 2022 10:00 AM IST
మోడీ సర్కారు వైఫల్యాల చిట్టా తెలుసుకోవాలని ఉందా?
X
తన నోటి మాటలతో ఎదుటి వ్యక్తిని ఇట్టే కన్వీన్స్ శక్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎంత ఎక్కువన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను ఏదైనా స్టాండ్ తీసుకుంటే.. అంతకు ముందు తాను మాట్లాడిన మాటలకు ఏ మాత్రం పొంతన లేకుండా మాట్లాడటం గొప్పేం కాదు కానీ.. ఆ మాటల్ని వినే వేళలో.. గతంలో కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటల్ని గుర్తు రాకుండా ఉండే ఆయన మాటలు గొప్పవనే చెప్పాలి.

కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కారు మొదటి టర్మ్ లోనే కాదు.. రెండో టర్మ్ లోనూ కొంతకాలం ఎలాంటి విమర్శలు చేయని కేసీఆర్.. ఈ మధ్యన మాత్రం అందుకు భిన్నంగా కేంద్ర రాజకీయాల మీదా.. మోడీ సర్కారు మీదా ఘాటు విమర్శలు చేయటం తెలిసిందే. కేంద్ర రాజకీయాల్ని మార్చాల్సిన అవసరం ఉందంటూ ఎజెండా తీసుకున్న కేసీఆర్.. బీజేపీ.. కాంగ్రెస్ యేతర పక్షాన్ని ఒక జట్టుగా చేయాలన్న వాదనను ఇంతకాలం వినిపిస్తూ వచ్చారు.

రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా మాత్రం కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి యశ్వంత్ సిన్హాను సపోర్టు చేస్తున్న వైనంపై పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా యశ్వంత్ సిన్హాకు సంపూర్ణ మద్దతు ఇవ్వటమే కాదు.. మోడీ సర్కారు చేసిన తప్పులు.. వైఫల్యాల చిట్టాను విప్పారు. ఈ తప్పుల్ని విన్నప్పుడు.. మరింత కాలం మోడీ సర్కారును ఎందుకు విమర్శించలేదన్న సందేహం కలుగక మానదు. ఇక.. మోడీ సర్కారుపై కేసీఆర్ లేవెత్తిన విమర్శల చిట్టాను చూస్తే..

- దేశ ప్రధానమంత్రిలా కాకుండా ఒక సేల్స్ మ్యాన్ లా ప్రధాని వ్యవహరిస్తున్నారు. విద్వేషాల్ని రెచ్చగొడుతూ భారత భవిష్యత్తును నాశనం చేస్తున్నారు.

- పెట్రో.. గ్యాస్.. ఎరువులతో పాటు.. నిత్యావసరాలన్నింటి ధరల్ని పెంచారు.

- ప్రజాస్వామ్యాన్ని మోడీ సర్కారు ఖూనీ చేస్తోంది. ఇప్పటివరకు 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని కూల్చారు.

- మహారాష్ట్రలో మాదిరి తెలంగాణలోనూ ప్రభుత్వాన్ని పడగొడతామని కేంద్ర మంత్రి ఒకరు చెబుతున్నారు.

- వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి రైతుల్ని ఇబ్బందిపెట్టారు.

- చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన అన్నదాతను జీపులతో తొక్కించారు. తెలంగాణ ప్రభుత్వం పంజాబ్ రైతులకు పరిహారం ఇస్తే ప్రధాని.. కేంద్ర మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.

- వికాశం పేరుతో దేశాన్ని నాశనం చేశారు. మోడీ పాలనతో సామాన్యుడు బతకలేని పరిస్థితికి తీసుకొచ్చారు.

- కేంద్ర విధానాలతో ఫియట్.. ఫోర్డ్.. జనరల్ మోటార్స్.. డాట్సన్ లాంటి కంపెనీలు దేశం విడిచి వెళ్లిపోయాయి.

- చైనా 16 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థతో ముందుకెళుతోంది. భారత్ 5 ట్రిలియన్ల ఎకానమీ అని మోడీ చెబుతున్నారు. కానీ.. 3.1 ట్రిలియన్ల దగ్గరే ఉన్నాం.

- మోడీ పాలనతో దేశంలో నిరర్థక ఆస్తులు రూ.4లక్షల కోట్ల నుంచి రూ.18.6 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

- ద్రవ్యోల్బణం పెరిగింది. జీడీపీ పడిపోయింది. రూపాయి ఎందుకు పతనం అవుతుందో ఆయన చెప్పాలి.

- నేపాల్.. బంగ్లాదేశ్ లో కరెన్సీ విలువ పడిపోదు. కానీ భారత్ లో ఆ పరిస్థితి ఎందుకు?

- కరోనా నియంత్రణలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. లక్షల మంది ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు వెళ్లారు.

- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తరఫున ప్రచారం చేయటమా? ట్రంప్ ఓడారు. ఏ ప్రధాని అయినా ఇలా చే్సతారా? అమెరికా ఎన్నికలను అహ్మదాబాద్ పురపాలక ఎన్నికలు అనుకున్నారా?

- దేశంలో సరిపడా బొగ్గు నిల్వలుఉన్నా.. విదేశాల నుంచి కొనాలని రాష్ట్రాలకు కేంద్రం హుకుం చేస్తోంది. వ్యాపారులైన ఆయన దోస్తులకు తప్ప ప్రజలకు సేవ చేయాలని లేదు.

- మీరు ఎంత అవినీతి చేశారో.. మీ స్నేహితులైన వ్యాపారులకు ఎంత దోచిపెట్టారో మా దగ్గర లెక్కలు ఉన్నాయి. చిట్టాను త్వరలోనే బయటపెడతాం.