Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ వార్తతో తెగ కొన్నారు.. ఐదు రోజుల్లో రూ.973 కోట్ల మద్యం విక్రయం

By:  Tupaki Desk   |   6 July 2020 11:30 PM GMT
లాక్ డౌన్ వార్తతో తెగ కొన్నారు.. ఐదు రోజుల్లో  రూ.973 కోట్ల మద్యం విక్రయం
X
కేసులు వెయ్యికి పైగా నమోదవడం.. రాష్ట్రంలోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు వెలుగు చూడడం.. భయాందోళనకర పరిస్థితి ఏర్పడడం వంటి వాటితో మళ్లీ లాక్ డౌన్ ప్రస్తావన వచ్చింది. దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నచ స్థాయి సమీక్ష చేశారు. మూడు రోజుల పాటు హైదరాబాద్ లో లాక్ డౌన్ అమలు చేయాలా వద్దా అని తీవ్రంగా చర్చించారు. ఈ చర్చ కొనసాగుతుండగా ప్రజలందరూ అప్రమత్తమయ్యారు. మళ్లీ లాక్ డౌన్ విధిస్తారనే ఉద్దేశంతో ప్రజలు ముందు జాగ్రత్త పడ్డారు. ఈ సందర్భంగా నిత్యావసర వస్తువులు.. సరుకులు కొనుగోలు చేశారు. వారు అలా ఉంటే ఇక మందుబాబులు కూడా ముందస్తు జాగ్రత్త పడ్డారు. గతంలో సంపూర్ణ లాక్ డౌన్ హఠాత్తుగా ప్రకటించడంతో రెండున్నర నెలలపాటు మందుకు దూరమైన విషయం తెలిసిందే. మళ్లీ అలాంటి పరిస్థితి వస్తుందని మందుప్రియులు అప్రమత్తమయ్యారు.

ఈ సందర్భంగా భారీ ఎత్తున మద్యం కొనుగోలు చేశారు. లాక్ డౌన్ ఉంటే మద్యం లభించదనే భావనతో ముందు జాగ్రత్తగా మద్యం నిల్వ చేసుకున్నారు. అవసరానికి మించి కొనుగోలు చేశారు. దాదాపు నెలకు సరిపడా మద్యం కొన్నారని మద్యం విక్రయాల లెక్కలు పరిశీలిస్తే తెలుస్తోంది. ఈ విధంగా ఒక్క ఐదు రోజుల్లోనే ఏకంగా రూ.973.61 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. అది జూన్ 26-30 తేదీల మధ్యనే మద్యం భారీగా అమ్ముడుపోయింది.

జూలై 1వ తేదీ నుంచి హైదరాబాద్ లో లాక్ డౌన్ విధిస్తారనే వార్త మందుబాబులను వైన్స్ కు పరుగులు పెట్టేలా చేసింది. అందుకే లాక్ డౌన్ తర్వాత మద్యం కొనుగోలుకు ఎగబడ్డట్టు ఈ ఐదు రోజుల్లో మందుబాబులు అంతలా వైన్స్ దుకాణాల ఎదుట బారులు తీరారు. భారీ ఎత్తున క్యూ లైన్లు ఉన్నాయి. అయితే ఈ మద్యం విక్రయాలు సాధారణ ప్రజలతో పాటు సిండికేట్ వ్యాపారులు.. బెల్టు షాపుల నిర్వాహకులు భారీగా చేసినట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ విధిస్తే మద్యం భారీ ధరకు విక్రయించి సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో భారీగా మద్యం కొనుగోళ్లు చేశారు. దీంతో పెద్దమొత్తంలో వైన్స్ దుకాణాల్లో స్టాక్ అయిపోయింది. ఈ కొనుగోళ్లతో జూన్ నెల భారీగా కొనుగోళ్లు నమోదయ్యాయి. ఒక్క జూన్ లోనే రూ.1,955 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. మే నెలలో రూ.1,864 కోట్ల మద్యం విక్రయం జరిగింది.