Begin typing your search above and press return to search.

దివాలా పిటిషన్ దాఖలు చేసిన లింగమనేని?

By:  Tupaki Desk   |   18 Nov 2019 7:43 AM GMT
దివాలా పిటిషన్ దాఖలు చేసిన లింగమనేని?
X
తెలుగునాట వ్యాపార వేత్తలుగా మీడియాలో వినిపించే పేర్లలో ఒకటి లింగమనేని రమేశ్. ఇరవై ఏళ్ల క్రితం ఆయనగారి పరిస్థితికి ఐదేళ్ల క్రితం నాటి పరిస్థితికి ఏ మాత్రం సంబంధం లేదని చెప్పాలి. కట్ చేస్తే.. తాజాగా ఆయన పరిస్థితి గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.

ఎందుకంటే.. ఏపీ రాజధాని అమరావతి చుట్టూనే కాదు.. విజయవాడలోనే పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసిన ఆయన ఎంతో ఫేమస్. అంతేనా.. టీడీపీ అధినేత చంద్రబాబుకు తన గెస్ట్ హౌస్ ను అద్దెకు ఇచ్చిన మొనగాడు. హైదరాబాద్ రూపురేఖల్ని మార్చేసిన పెద్దమనిషి చంద్రబాబు లాంటోడు ఉండేందుకు అవసరమైన ఇంటిని ఇచ్చిన మొనగాడు లింగమనేని రమేశ్.

అలాంటి ఆయన తాజాగా తన వ్యాపార సంస్థలు తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయాయని.. తాను దివాలా తీసినట్లుగా ప్రకటించినట్లు కొన్ని మీడియా వర్గాలు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. అవి అందించిన వివరాల ప్రకారం లింగమనేని ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నష్టాల పాలైందని.. ఆ సంస్థకు రుణాలు ఇచ్చిన బ్యాంకులకు.. ఆర్థిక సంస్థలకు.. వ్యక్తులకు తిరిగి చెల్లించే పరిస్థితుల్లో తాము లేమన్న విషయాన్ని చెప్పినట్లుగా చెబుతున్నారు.

తమ కంపెనీ తీవ్రమైన నష్టాలకు గురైనట్లుగా పేర్కొంటూ దివాలా పిటిషన్ ను దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. 2020 మే 12 నాటికి దివాలా ప్రక్రియను పూర్తి చేస్తామని చెబుతున్నట్లు తెలుస్తోంది. లింగమనేని రమేశ్ సామాన్యుడు కాదు. ఆయన ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారానికే పరిమితం కాలేదు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా చెప్పే ఆయన చేసిన వ్యాపారాల లిస్టు భారీగా ఉందని చెబుతారు.

లింగమనేని రియల్ ఎస్టేట్ వెంచర్స్.. హౌజింగ్ ప్రాజెక్టులు.. ఎయిర్ కోస్టా విమాన సర్వీసులు.. పవర్ ప్లాంట్లు.. హెల్త్ కేర్.. ఎడ్యుకేషన్.. హోటల్స్.. ఇలా పెద్ద ఎత్తున ఆయన పలు వ్యాపారాలు చేసినట్లుగా చెబుతారు. నిజానికి లింగమనేని అడుగు పెట్టని వ్యాపారమే లేదన్నట్లుగా వ్యాపార వర్గాల వ్యాఖ్యలు చేస్తుంటాయి. 1996లో లింగమనేని ఎస్టేట్స్ ను ప్రారంభించినప్పటికీ గడిచిన పదేళ్లలో పెద్ద ఎత్తున పేరు వచ్చింది. ఈ సంస్థ రిజిస్టర్ ఆఫీసు విజయవాడలో ఉంటే.. కార్పొరేట్ ఆఫీసు మాత్రం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఉంది.

కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వెంచర్లలో లింగమనేని రమేశ్ పెట్టుబడులు పెట్టినట్లు చెబుతారు. అలాంటి ఆయన తాజాగా తాను తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయినట్లుగా పేర్కొనటం సంచలనంగా మారింది. తమ వ్యాపారాలన్ని నష్టాల్లో కూరుకుపోయినట్లుగా పేర్కొంటూ దివాలా పిటిషన్ ను దాఖలు చేయటమేకాదు.. ఎవరెంత రుణాలు ఇచ్చారు? లాంటి వివరాలు వెల్లడించాలని.. లెక్కలు తేలుస్తామంటున్నారు.

ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు చెందిన వ్యాపార సంస్థ బ్యాంకు నుంచి తీసుకున్న రుణం తిరిగి చెల్లించని కారణంగా ఆస్తుల వేలానికి నోటీసులు జారీ చేస్తే.. తాజాగా బాబుకు అత్యంత సన్నిహితుడైన లింగమనేని రమేశ్ దివాలా పిటిషన్ దాఖలు చేసినట్లుగా వస్తున్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.