Begin typing your search above and press return to search.

కన్న కొడుకుల నుంచి కాపాడండి.. రోడ్డెక్కి తల్లి ఆందోళన

By:  Tupaki Desk   |   14 Nov 2020 9:00 AM IST
కన్న కొడుకుల నుంచి కాపాడండి.. రోడ్డెక్కి తల్లి ఆందోళన
X
ఇన్నాళ్లు పారిశుద్ధ్య కార్మికురాలి గా పని చేసి వచ్చినది తన ఇద్దరు కుమారులకు ఇచ్చింది. భర్త ఐదేళ్ల క్రితం మృతి చెందాడు. వృద్ధురాలైన ఉద్యోగాన్ని రెండో కోడలు కు అప్పగించింది. ఉద్యోగం మానేసి సరిగ్గా ఏడాది అవుతోంది. ఇప్పుడు ఆ తల్లి భారంగా మారింది. కొడుకులు కోడళ్ళు కలిసి ఇంటి నుంచి తరిమేశారు. దీంతో ఆమె తన కుమారుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షించాలని రోడ్డెక్కి ఆందోళన నిర్వహించింది. ఈ సంఘటన శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేముల వాడ పట్టణం లో జరిగింది.

సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధి లోని తిమ్మాపూర్ కు చెందిన సుంకపాక నర్సవ్వ ఏడాది కిందటి వరకు పారిశుద్ధ్య కార్మికురాలి గా పని చేసింది. భర్త ఎల్లయ్య ఐదేళ్ల క్రితమే చనిపోగా వయసు కూడా సహకరించకపోవడంతో ఆమె తాను చేస్తున్న ఉద్యోగాన్ని రెండో కొడుకు రాజు భార్య సంధ్యారాణి కి అప్పగించింది. 10 నెలలుగా నర్సవ్వ ఇంటి వద్దే ఉంటోంది.కాగా శుక్రవారం ఆమె తిమ్మాపూర్ లోని తెలంగాణ చౌక్ కు చేరుకుని ఓ చేత్తో మందు డబ్బా, మరో చేత్తో ప్ల కార్డు చేతపట్టుకొని కన్న కొడుకుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, కాపాడాలని నినాదాలు చేసింది. స్థానికుల సమాచారంతో లోకల్ సీఐ సంఘటనా స్థలానికి చేరుకుని ఆమె సమస్య తెలుసుకున్నారు.

నర్సవ్వ మాట్లాడుతూ కొన్నేళ్ల కిందటే భర్త చనిపోగా, తనకు ఇద్దరు కుమారులు శ్రీనివాస్‌, రాజు ఉన్నట్లు చెప్పింది. గత ఏడాది వరకు తాను పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేసి ఆ ఉద్యోగాన్ని తన రెండో కోడలుకు అప్పగించినట్లు చెప్పింది.. అయితే కొద్దిరోజులుగా కొడుకులు,కోడళ్లు తనను భరించలేమని వేధిస్తున్నారని వాపోయింది. ఇంటి నుంచి బయటకు గెంటేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేస్తారనే ఇలా రోడ్డుపై ఆందోళన కార్యక్రమం చేపట్టినట్టు వెల్లడించింది. సమస్య పరిష్కరిస్తానని, ఆందోళన విరమించాలని నచ్చజెప్పిన సీఐ ఆమెను ఇంటికి పంపించారు.ఆమె కొడుకులను పోలీస్ స్టేషన్‌ కు పిలిపించి తల్లిని బాగా చూసుకోవాలని కౌన్సెలింగ్ ఇచ్చారు.