Begin typing your search above and press return to search.

ఆ మాయదారి మాస్కులు.. కరోనా కారకాలు

By:  Tupaki Desk   |   10 Sept 2020 9:15 AM IST
ఆ మాయదారి మాస్కులు.. కరోనా కారకాలు
X
మనమంతా కరోనా నుంచి రక్షణ కోసం మాస్కులు ధరిస్తున్నాం.. మన పక్కవాళ్లు కూడా మాస్కులు ధరిస్తే సంతోషిస్తాం. జనసందోహంలో ఉన్నప్పుడు, ఆస్పత్రుల్లో, ఇతర రద్దీ ప్రదేశాల్లో ఉన్నప్పుడు కచ్చితంగా మాస్క్​ ధరించాలని డబ్ల్యూహెచ్​వో కూడా సూచించింది. కానీ ఇప్పడు ఇప్పుడో కొత్త సమస్య వచ్చి పడింది. కొన్ని రకాల మాస్కులు పెట్టుకున్నవారు మన పక్కన ఉన్నా మనకు ప్రమాదమేనట. అవే వాల్వుతో ఉన్న మాస్కులు. ఈ మాస్కులు పెట్టుకున్నవారు కనుక మన పక్కన ఉంటే మనకు వైరస్​ ప్రమాదం పొంచిఉన్నట్టే. కొన్ని మాస్క్‌లు ముందు వైపు మధ్యలో ఒక ప్రత్యేకమైన వాల్వుతో ఉంటాయి. (ఎన్95, ఎఫ్‌పీపీ2, ఎఫ్‌పీపీ3 తదితర మాస్క్‌లు ఇలా ఉంటాయి) ఈ మాస్కులు పెట్టుకున్నవారికి మంచిదే. వారికి వైరస్​ సోకే ప్రమాదం తక్కువగా ఉంటుంది. కానీ వారిపక్కన ఉన్నవారికి ప్రమాదం.. ఎందుకంటే ఈ మాస్కులు వైరస్​ను లోపలికి రాకుండా అడ్డుకుంటాయి. కానీ సదరు వ్యక్తికి కరోనా ఉంటే మాత్రం ఈ వైరస్​ వాల్వు గుండా బయటకు వస్తుంది. సాధారణ మాస్కులు ధరించినవారికి ఇతరుల నుంచి ఇన్​ఫెక్షన్​ రాదు.

ఒక వేళ వారిలోపల ఇన్​ఫెక్షన్​ ఉన్నా బయటకు పోదు. కానీ వాల్వ్​తో ఉండే మాస్కులు ధరిస్తే మాత్రం మన పక్కవాళ్లకు ప్రమాదం పొంచిఉన్నట్టే.. ఒకవేళ మనకు కరోనా ఉంటే తప్పనిసరిగా వారికి సోకుతుంది. మాస్క్ వేసుకున్న వ్యక్తి ఊపిరి పీల్చుకున్నప్పుడు హానికారకాలను ఆపేలా, దానికి ఉన్న వాల్వు మూసుకుంటుంది. కానీ, అదే వ్యక్తి ఊపిరి వదిలినప్పుడు మాత్రం ఆ వాల్వు తెరుచుకుంటుంది. దీంతో పక్కన ఉన్న వ్యక్తికి ప్రమాదం. ఈ తరహా మాస్కులను కొందరు శాస్త్రవేత్తలు ‘సెల్ఫిష్​’ మాస్కులుగా పిలుస్తున్నారు. సాధారణ ప్రజలు సర్జికల్​ మాస్కులను ధరించడమే ఎంతో ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. స్పెయిన్‌లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడి ప్రభుత్వం వీటి వాడకాన్ని నిషేధించింది.

హానికారక మాస్కులైతే ఎందుకు తయారుచేస్తున్నారు?
ఇంత హాని కలిగించే మాస్కులు ఎందుకు తయారుచేస్తున్నారన్న అనుమానం మనకు రాకమానదు. ఈ మాస్కులు కేవలం వైద్యనిపుణుల కోసం ఉద్దేశించినవి. వారు రోజులో అనేక గంటలపాటు మాస్కు ధరించాల్సి ఉంటుంది. సర్జికల్​ మాస్క్​ పెట్టుకుంటే వారికి శ్వాస సరిగ్గా అందకపోవచ్చు.. అటువంటి వారికోసం ఈ తరహా మాస్కులను తయారుచేస్తున్నారు. అయితే ఈ మాస్కులు ఇప్పుడు అన్ని మెడికల్​ షాప్​ల్లోనూ అందుబాటులో ఉండటంతో సాధారణ ప్రజలు సైతం దీన్ని వాడుతున్నారు. ప్రజలెవరూ ఇటువంటి మాస్కులు వాడొద్దని.. సర్జికల్ మాస్కులనే వాడాలని సూచిస్తున్నారు వైద్యనిపుణులు.