Begin typing your search above and press return to search.

నాకు ప్రాణహాని వుంది!!

By:  Tupaki Desk   |   30 Oct 2018 4:36 PM GMT
నాకు ప్రాణహాని వుంది!!
X
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావును సిట్ అధికారులు ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్ లో విచార‌ణ జ‌రుపుతోన్న సంగ‌తి తెలిసిందే. అయితే, హ‌ఠాత్తుగా శ్రీ‌నివాస్ ...త‌న‌కు ఛాతీలో ద‌డ‌గా ఉంద‌ని, ఎడ‌మ చేయి నొప్పి వ‌స్తోంద‌ని చెప్ప‌డంతో కేజీహెచ్ కు తరలించారు. ఆస్పత్రికి తీసుకు వెళ్తున్నపుడు శ్రీ‌నివాస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. త‌న‌కు ప్రాణహాని ఉంద‌ని పోలీసుల‌కు తెలిపాడు. త‌న‌కు వైద్యం వ‌ద్ద‌ని.. అవయవ దానం చేస్తాన‌ని వైద్యులతో శ్రీనివాసరావు అన్న‌ట్లు తెలుస్తోంది. అయితే, శ్రీ‌నివాస్ కు చెక‌ప్ చేసిన వైద్యులు...అత‌డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంద‌ని నిర్ధారించారు. దీంతో, కేజీహెచ్‌ నుంచి శ్రీనివాస్ ను డిశ్చార్జ్‌ చేశారు. ప్ర‌స్తుతం శ్రీ‌నివాస్ ను య‌థాత‌ధంగా ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్‌కు తరలించారు.

శ్రీనివాసరావు ఉద‌యం నుంచి ఆహారం తీసుకోలేదని పోలీసులు చెబుతున్నారు. హ‌ఠాత్తుగాఎడమ చేయి నొప్పి అని, ఛాతిలో దడగా ఉందని చెప్పడంతో వైద్యులను స్టేష‌న్ కు పిలిపించామ‌ని చెప్పారు. ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్ లో వైద్య‌ పరీక్షలు నిర్వ‌హించిన అనంతరం...వైద్యుల సూచనల ప్రకారం...కేజీహెచ్‌కు తరలించామ‌న్నారు. అయితే, శ్రీ‌నివాస్ ఎడ‌మ‌చేతికి ఎక్స్ రే తీశామ‌ని, గ్యాస్ట్రిక్ ప్రాబ్ల‌మ్ వ‌ల్ల కూడా ఛాతిలో ద‌డ‌గా ఉండే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు తెలిపారు. శ్రీ‌నివాస్ ప‌రిస్థితి ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గా ఉంద‌ని డిశ్చార్జ్ చేశారు. శ్రీ‌నివాస్ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని సిట్ అధికారులు స్ప‌ష్టం చేశారు. ప్రతి 48 గంటలకు ఓసారి కస్టడీలో ఉన్న నిందితుడికి చేయించే వైద్య పరీక్షల్లో భాగంగానే ఈ పరీక్ష‌లు చేయించామ‌ని సిట్ అధికారులు తెలిపారు. అయితే, డాక్ట‌ర్ల సూచ‌న ప్ర‌కారం కేజీహెచ్‌కి వైద్య పరీక్షల కోసం తరలించామని పేర్కొన్నారు. విచారణ సాఫీగా సాగుతోందని చెప్పారు. మ‌రోవైపు, త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని శ్రీ‌నివాస్ చెప్పిన విష‌యంపై వైసీపీ నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. శ్రీ‌నివాస్ ర‌క్ష‌ణ బాధ్య‌త ప్ర‌భుత్వానిదేన‌ని వారు అన్నారు. శ్రీ‌నివాస్ కు మ‌రింత భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని, అత‌డి ఆరోగ్య ప‌రిస్థితిని స‌మీక్షించాల‌ని డిమాండ్ చేశారు.