Begin typing your search above and press return to search.

జర్నలిస్టుల బతుకు..ఎక్కడిదాకా ఈ పయనం?

By:  Tupaki Desk   |   8 Jun 2020 7:00 PM IST
జర్నలిస్టుల బతుకు..ఎక్కడిదాకా ఈ పయనం?
X
కరోనాతో మరణించిన హైదరాబాద్ రిపోర్టర్ మనోజ్ మరణం జర్నలిస్టుల బతుకుల్లోని విషాదకోణాలపై మరోసారి పెద్ద ఎత్తున చర్చకు తెరతీసింది. అసలు ఏ రక్షణలు, ఏ భరోసాలు లేకుండా… ప్రతి యుద్ధంలోనూ ముందుండేది. సమాజంలోని ప్రతి వర్గానికీ అండగా ఉండేది, పోరాడేది, చివరకు తనే గాయపడి, నిశ్శబ్దంగా నిష్క్రమించేది జర్నలిస్టే…

లోకల్ జర్నలిస్టుల్లో అక్రమార్కులు ఉండొచ్చు… కానీ పెద్ద పెద్ద మీడియా హౌజు ఓనర్లే ఆ పనులు చేస్తుంటే ఇక దిగువ స్థాయిలో వాళ్లను అనడానికి ఏముంది..? సమాజంలో డిగ్రేడ్ అవుతున్న విలువలు వాళ్లనూ ప్రభావితం చేస్తాయి కదా… పైగా అందరినీ ఒకేగాటన కట్టడం కూడా అన్యాయం… అలాగే ఆ వృత్తిని అవమానించినట్టే అవుతుంది… మరీ అన్నిరకాలుగా సున్నితంగా మారిపోయిన బతుకులు ఎవరివీ అంటే… జర్నలిజాన్ని, ఈ కొలువుల్ని కెరీర్‌గా మార్చుకుని బతికే వాళ్లవి

ప్రత్యేకించి ప్రింట్ మీడియా జర్నలిస్టుల పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. రాబోయే రోజుల్లో ఇంకా దుర్దినాలే ఉండబోతున్నయ్. ఇంకా టీవీ మీడియా జర్నలిస్టులకు సెగ తగలడం లేదు. కానీ పత్రికలు మూతపడుతున్నయ్, కొలువులకు భద్రత లేదు. జీతాలు కోస్తున్నారు. అసలే అరకొర.. అందులోనూ కోతలు… అసలు నిలబడతామా, బజారున పడతామా..? తెలుగు, హిందీ, ఇంగ్లిష్… భాషాభేదం ఏమీ లేదు… అన్ని పత్రికలదీ అదే దురవస్థ…

టీవీ మీడియాలో ఫీల్డ్ రిపోర్టర్ల పరిస్థితీ అంత గొప్పగా ఏమీలేదు… పరుగు, పరుగు… కాలంతో పరుగు… వృత్తిపరమైన ఒత్తిళ్లతో… అకాల వృద్ధాప్యాలు, అర్ధంతరంగా చావులు…

అసలు జర్నలిస్టు బతుకే ఫుల్ రివర్స్… దొరికే ఈమాత్రం జీతానికి సెలవులు సరిగ్గా దొరకవు, ఏ సాయంత్రమూ మనది కాదు… వేరే వృత్తులకూ దీనికీ అస్సలు పొసగదు… బంధువులో, మిత్రులో దేనికి పిలిచినా వెళ్లే సీన్ ఉండదు, అందరూ దూరం అవుతుంటారు… అందరూ వాడుకునేవాళ్లే, తీరా ఆపదొస్తే ఎవ్వడూ ఆదుకోడు… కరివేపాకు బతుకులు…

ఆరోగ్యానికి భద్రత లేదు… ఆర్థికానికి భద్రత లేదు… ఏ నలభై దాటాకో, యాభై దాటాకో వెనక్కి తిరిగి చూసుకుంటే… బీపీలు, సుగర్లు, అల్సర్లు ఎట్సెట్రా… ముందే పలకరించే ముసలితనం… ఇక ఏ పనికీ అక్కరకురాని చెరుకు పిప్పి..! కొన్ని వందల ఉదాహరణలు…

కరోనా విషయమే తీసుకోండి. ఫ్రంట్ వారియర్స్ అని పేరుకు పొగడ్త… కానీ పారిశుద్ధ్య సిబ్బందికి, పోలీసులకు, డాక్టర్లకు, పారామెడికల్ స్టాఫ్‌కు… చివరకు కరెంటోళ్లను కూడా ఇదే జాబితాలో చేర్చారు పాలకులు… కానీ జర్నలిస్టులకు ఏ దిక్కూ లేదు… మరీ మరీ అడిగితే పది కిలోల బియ్యం, అయిదు కిలోల కూరగాయలు పంపిణీ… అదీ జర్నలిస్టుల బతుకు…

పుసుక్కున ప్రాణగండం వస్తే… బీమా లేదు, ధీమా లేదు… భార్యాబిడ్డలకు దిక్కూ లేదు… మేనేజ్మెంట్లు వదిలేస్తాయి, ప్రభుత్వాలు పట్టించుకోవు… ఎంత దారుణం అంటే..? ఓ పత్రిక హెడ్డాఫీసులో ఓ రిపోర్టర్‌కు కరోనా పాజిటివ్… మిగతావారిలో భయం… పరీక్షలు చేయించండి మహాప్రభో అని మొత్తుకుంటే కనికరించినవారు లేరు… మరో పత్రికలోనూ అదే దుర్గతి… జాతీయ చానెళ్ల వీడియోమెన్, ఢిల్లీలో జర్నలిస్టులూ ఈ కరోనా సెగను అనుభవించారు…

అందుకే ఇప్పుడు జర్నలిజం అనే వృత్తి వైపు ఎవరూ రావడం లేదు… నిజానికి ఇప్పుడున్న స్థితిలో ఈ వృత్తి వైపు రావాలని కోరడమూ అన్యాయమే… జర్నలిజం అనేది ఈరోజుల్లో మీడియా హౌజుల ఓనర్ల ప్రయోజనాలకు మాత్రమే… సమాజానికి కాదు, జర్నలిస్టులకు అంతకన్నా కాదు… ఎంత సర్ది చెప్పుకున్నా, ఈ భావనను ఎంత దాచేసుకుంటున్నా సరే… పదే పదే పైకి లేచి వికృత రూపంలో వికటంగా నవ్వుతూ వెక్కిరిస్తున్న చేదునిజం ఇదే…