Begin typing your search above and press return to search.

ఆ నాయ‌కుడు ప్ర‌పంచం మ‌న‌సును గెలిచాడు

By:  Tupaki Desk   |   17 Feb 2016 10:30 PM GMT
ఆ నాయ‌కుడు ప్ర‌పంచం మ‌న‌సును గెలిచాడు
X
ఒక్క చాన్స్ ఒకే ఒక్క చాన్స్‌...ప‌ద‌వి కోసం నాయ‌కులు వళ్లె వేసే డైలాగ్ ఇది. ఒక్క‌సారి అధికారం ద‌క్కితే వీలైతే ల‌క్ష‌కోట్లు, కాక‌పోతే క‌నీసం వేల‌కోట్లు, కుదిరితే స్విచ్ బ్యాంక్‌ల‌లో న‌ల్ల‌ధ‌నం ఖాతాలు, దేశంలో బినామీ కంపెనీలు! ఇది నేటి రాజ‌కీయ నాయ‌కుల తీరు. మంత్రులు, ముఖ్య‌మంత్రులు, వాళ్ల పుత్ర‌రత్నాలు చేసే ప‌నులు ఇవి. కానీ ఏకంగా దేశ‌ధ్యక్షుడి హోదాలో ఉండి కూడా క‌డు పేద జీవితాన్ని పేద‌ల కోసం గ‌డ‌ప‌డ‌మంటే...న్యాయ‌బద్ధంగా వ‌చ్చే నెల‌వారీ వేత‌నాన్ని కూడా త్యాగం చేయాలంటే...అందుకోసం స‌మాజంపై ప్రేమ ఉండాలి. ప్ర‌జ‌ల‌కోసం ఏదైనా చేయాల‌న్న త‌పన జ్వ‌లించాలి. ఆ రెండు ఉన్న వ్య‌క్తే ఉరుగ్వే అధ్యక్షుడిగా ప‌నిచేసిన‌ జోస్ ముజికా.

ఆఫ్రికా ఖండంలోని అతిపేద దేశ‌మైన ఉరుగ్వేకు 2010 నుంచి 2015 వరకు జోస్ ముజికా అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రపంచంలో అతి పేద దేశానికి అధ్యక్షుడిగా ఉన్న త‌ను దేశం కోసం ఏమైనా చేయ‌గ‌ల‌నా అని ఆలోచించిన ముజికా త‌న‌కొచ్చే కేవలం 800 డాలర్ల వేతనంలో నుంచి 90 శాతం సొమ్మును త‌న ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే కార్యకపాలకే విరాళంగా ఇచ్చాడు. సంక్షేమ ప‌రంగా ఈ నిర్ణ‌యాన్ని తీసుకుంటూనే దేశం కోసం ఏం చేయాలో కూడా ఆలోచించాడు జోస్ ముజికా. ఉరుగ్వేలో పేదరికం తొల‌గించేందుకు, నిరుద్యోగం తగ్గిపోయేందుకు త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టాడు. మారుతున్న స‌మాజాన్ని గౌర‌విస్తూనే స్వ‌లింగ వివాహాల‌ను చ‌ట్ట‌బ‌ద్దం చేశాడు. అంతేకాకుండా దేశంలో అత్య‌ధికంగా ప్ర‌జ‌లు ఉప‌యోగించే మార్జువానా అనే న‌ల్ల‌మందు వాడకాన్ని, రవాణాను చట్టబద్దం చేశాడు. ప్రేమ పేరుతో ఆడా-మ‌గ శృంగారం వ‌ల్ల ఎదుర‌వుతున్న గ‌ర్బాల‌ను తొల‌గించే అవ‌కాశం అప్ప‌టివర‌కు లేక‌పోవ‌డంతో...ఆ సౌల‌భ్యాన్ని కూడా క‌లిగించాడు.

ఒకప్పుడు గెరిల్లా యోధుడు అయిన జోస్ ముజికా పోరాటంలో భాగంగా పదేళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించాడు. ఒక దశలో లోతైన బావిలో అతి దుర్భర స్థితిలో గడిపాడు. త‌న గ‌తాన్ని మ‌రిచిపోకుండా ఉండ‌టంతో పాటు త‌న దేశం కోసం పాటుప‌డ‌టంలో భాగంగా..ఇప్ప‌టికీ తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న చిన్న ఇంటిలోనే జీవిస్తున్నాడు. భార్య, ఒక‌ శునకం, 1987 నాటి పాత డొక్కు కారు...ఇవే ముజికా ఆస్తులు. అందుకే ఆయ‌న్ను దేశ ప్ర‌జ‌లు గుర్తించారు. ముజికా ప‌నితీరుపై స‌ర్వే నిర్వ‌హించ‌గా 65 శాతం ప్ర‌జ‌లు అద్భుత‌మ‌ని తీర్పిచ్చారు. అంతేకాదు ఆయ‌న్ను ప్ర‌పంచం కూడా గుర్తించింది. బెర్ట్రాండ్ లో హ్యూమన్ అనే టైటిల్‌తో ముజికాపై సినిమా తీశారు. ఆ సినిమా కోసం ఇచ్చిన ఇంటర్వ్యూ సంద‌ర్భంగా ముజికా తన నిరాడంబర జీవితం గురించి చెప్పిన మాట‌లు ఇపుడు సోష‌ల్ మీడియాలో చాలా మందికి ఆద‌ర్శ‌ప్రాయంగా ఉన్నాయి. ఇంకో మాట వర‌ల్డ్స్‌ మోస్ట్ హంబుల్ లీడర్ అనే గౌర‌వం కూడా ముజికా ఖాతాలోనే జ‌మ‌యింది!

ఇదీ ముజికా జీవితం. రాజ‌కీయ నాయ‌కులంద‌రికీ ఆద‌ర్శ‌ప్రాయ‌మైన వ్య‌క్తిత్వం. ప్ర‌స్తుత త‌రం రాజ‌కీయ నాయ‌కుల్లో మ‌న‌దేశంలో ఇలా ఎందరున్నారో అనే ప్ర‌శ్న‌కు అస‌లు ఎవ‌రైనా ఉన్నారా అనే ఎదురు ప్ర‌శ్నే స‌మాధానం అవుతుందేమో క‌దా!!