Begin typing your search above and press return to search.

11 మంది పోలీసులకు యావజ్జీవకారాగార శిక్ష..ఎందుకు?

By:  Tupaki Desk   |   23 July 2020 10:15 AM IST
11 మంది పోలీసులకు యావజ్జీవకారాగార శిక్ష..ఎందుకు?
X
చేసిన తప్పునకు శిక్ష తప్పదు. తాజాగా మరోసారి ఈ మాటలో నిజమెంతన్నది నిరూపితమైంది. రాజస్థాన్ లోని పదకొండు మంది పోలీసు అధికారులకు యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. తాజాగా శిక్ష విధించిన పోలీసులంతా ఇప్పటికే రిటైర్ కావటం గమనార్హం.

35 ఏళ్ల క్రితం రాజస్థాన్ లోని భరత్ పూర్ రాజవంశానికి చెందిన రాజామాన్ సింగ్.. అతని ఇద్దరు అనుచరుల్ని హతమార్చిన ఉదంతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పదకొండుమంది మాజీ పోలీసు అధికారులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ కేసులో దోషులుగా తేలిన వారిలో డీగ్ ప్రాంత డీఎస్పీగా పని చేసిన 82 ఏళ్ల కాన్ సింగ్.. స్థానిక పోలీసు స్టేషన్ ఇన్ ఛార్జ్ ఎస్ఐ 78 ఏళ్ల వీరేంద్ర సింగ్.. అతని నాయకత్వంలోని పోలీసులు ఉన్నారు.
1985 ఫిబ్రవరి 21న రాజామాన్ సింగ్.. అతని ఇద్దరు అనుచరుల్ని పోలీసులు హతమార్చారు. నాటి రాజస్థాన్ ముఖ్యమంత్రి శివచరణ్ మాథుర్ ఎన్నికల ప్రచారం కోసం వచ్చినప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజామాన్ సింగ్ ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ వైపు జీపులో దూసుకెళ్లారు.

ఇది జరిగిన తర్వాతి రోజు ఆయన్ను.. ఆయన అనుచరులు ఇద్దరిని పోలీసులు డీగ్ వ్యవసాయ మార్కెట్ వద్ద ఎన్ కౌంటర్ లో కాల్చి చంపారు.ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పును మధుర జిల్లా జడ్జి సాధనారాణి ఠాకూర్ తీర్పును ఇవ్వటం సంచలనంగా మారింది. న్యాయం ఆలస్యం కావటం మామూలే. కానీ.. ఇన్నేళ్లా? అన్నదే అసలైన ప్రశ్న.