Begin typing your search above and press return to search.

అబద్ధాలు వర్సెస్ నిజాలు: పీఆర్సీపై ప్రచారానికి ఏపీటీఎఫ్ చెక్!

By:  Tupaki Desk   |   24 Jan 2022 7:30 AM GMT
అబద్ధాలు వర్సెస్ నిజాలు: పీఆర్సీపై ప్రచారానికి ఏపీటీఎఫ్ చెక్!
X
ఏపీ రాజకీయాన్ని పీఆర్సీ ఇష్యూ వేడెక్కిస్తోంది. ఇప్పటికే వస్తున్న జీతాల కంటే తక్కువగా వచ్చేలా జగన్ ప్రభుత్వం పీఆర్సీ నిర్ణయం తీసుకోవటంపై విస్మయాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ.. ఉద్యోగ సంఘాలు చేస్తున్నది అబద్ధాలంటూ కొట్టి పారేస్తోంది. ఇలాంటి వేళ.. ఏపీ ఉపాధ్యాయ సమాఖ్యలు సరికొత్త ప్రచారానికి తెర తీశారు. పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు వినిపించే వాదన మొత్తం తప్పంటూ వైసీపీ చేస్తున్న ప్రచారానికి చెక్ చెబుతూ.. అబద్ధాలు వర్సెస్ నిజాలు అంటూ వారు వివరిస్తున్న వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

ఇష్యూ ఏదైనా.. తమదైన వాదనను వినిపించే వైసీపీ ప్రచారానికి చెక్ పెట్టేలా.. వారి కంటే నాలుగు ఆకులు ఎక్కువ చదివినట్లుగా.. అధికారపక్షం వివరణకు వెనువెంటనే తయారు చేసిన వాదన ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇంతకీ వైసీపీ ఏం చెబుతోంది? దానికి కౌంటర్ గా ఏపీటీఎఫ్ ఏం చెబుతోందన్న విషయాల్లోకి వెళితే..

వైసీపీ వాదన: కొత్త పీఆర్సీలో జీతాల కోత అవాస్తవం. రూ.10వేల కోట్లు అదనంగా ఇస్తున్నాం.
ఏపీటీఎఫ్ ప్రతిస్పందన: అబద్ధపు ప్రచారాల్ని ఆపండి. కొత్త జీతాలు వద్దు. ప్రస్తుత జీతభత్యాల్ని కొనసాగించండి.

వైపీపీ వాదన: గ్రాట్యూటీ రూ.12 లక్షలనుంచి రూ.16 లక్షలకు పెంచాం.
ఏపీటీఎఫ్ ప్రతిస్పందన: పెంచాల్సింది రూ.20 లక్షలు. సవరించిన వేతనాలతో ప్రతి ఉద్యోగి రూ.2-4 లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఈ ఉత్తర్వులను జనవరి 17 నుంచి వర్తించేలా చేస్తామన్నారు. మూడున్నరేళ్లుగా పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు.. ఉద్యోగులు దీని కారణంగా నష్టపోతారు.

వైసీపీ వాదన: దేశంలో ఎక్కడా లేని రీతిలో రిటైర్మెంట్ వయసును 60నుంచి 62కు పెంచాం
ఏపీటీఎఫ్ ప్రతిస్పందన: లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యోగ.. ఉపాధ్యాయ.. కార్మికులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం అందించే వరంగా ఎవరూ భావించటం లేదు.

వైసీపీ వాదన: విలీనంతో ఆర్టీసీ ఉద్యోగాలు మెరుగుపడ్డాయి
ఏపీటీఎఫ్ ప్రతిస్పందన: కార్పొరేషన్ ఉద్యోగులు కాస్తా ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తర్వాత పెనం మీద నుంచి పొయ్యి మీద పడినట్లైంది. ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్న హక్కులు.. రాయితీలు వారు పొందుతున్నారా? కార్పొరేషన్ లో ఉన్న పరిస్థితి కంటే ప్రస్తుతం వారి జీవితాలు ఎలా మెరుగుపడ్డాయో వివరిస్తారా?

వైసీపీ వాదన: ఉద్యోగులను సంఘాల నాయకులు పెడదోవ పట్టించారు
ఏపీటీఎఫ్ ప్రతిస్పందన: జీతభత్యాల్లో కోత ఒక వైపు. ధరల పెరుగుదల మరోవైపు ఉద్యోగుల్లో కడుపు మంటను రగిల్చాయి. కలెక్టరేట్ల దిగ్భంధంలో నాయకత్వాన్ని అరెస్టు చేసినా..లక్షల మంది ఎవరికి వారుగా పోరాటంలోకి వచ్చారు. నాయకుల నుంచి ఉద్యోగులను విడదీసే మీ ఎత్తుగడలను మేం అర్థం చేసుకోగలం.
వైసీపీ వాదన: నాయకుల మాటలు విని ఆందోళన చేస్తే దెబ్బ తినేది ఉద్యోగులే
ఏపీటీఎఫ్ ప్రతిస్పందన: కొత్త పీఆర్సీతో ఉన్న హక్కులను కోల్పోయేలా చేశారు. జీత భత్యాల్లో తగినంత రీతిలో పెరుగుదలను ఉత్తర్వులు జారీ చేసినప్పుడే వారి ఆగ్రహ జ్వాలలు చల్లారతాయి. కొత్తగా దెబ్బ తినేది ఏమీ లేదు.

వైసీపీ వాదన: జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లలో 10 శాతం స్థలాల్ని కేటాయించాం. 20 శాతం రాయితీపై అందిస్తున్నాం.
ఏపీటీఎఫ్ ప్రతిస్పందన: స్థలాల కేటాయింపు.. రాయితీల్నిఎవరూ అడగలేదు. రాయితీల రూపంలో రూ.10లక్షల లబ్థి చేకూరుస్తున్నట్లు చెబుతున్నారు. స్థలం ఖరీదు రూ.50 లక్షలా? సగటు ఉద్యోగి కొనగలరా? ఇది సంక్షేమమా? స్థిరాస్తి వ్యాపారమా? ఉద్యోగులు సొసైటీగా ఉండి కోరిన సరసమైన ధరకు స్థలాల కేటాయింపు ఏమైంది?

వైసీపీ వాదన: విభజన సమస్యలు.. కొవిడ్ కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గింది
ఏపీటీఎఫ్ ప్రతిస్పందన: విభజన సమస్యలు ఉన్న కాలంలో అంటే 2015లో 43 శాతం ఫిట్ మెంట్ పొందాం. ప్రస్తుతం విభజన సమస్యలన్నీ సర్దుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ఆదాయం పెరిగిందని కాగ్ గణాంకాలే చెబుతున్నాయి. జీతభత్యాలు తగ్గించి.. ఐఆర్ రూపంలో ఇచ్చిన దాన్ని డీఏల నుంచి రికవరీ చేస్తున్నారు. పెరిగిన ధరలతో సతమతమవుతున్న ఉద్యోగులకు ఇది గుండె కోత కాదా?