Begin typing your search above and press return to search.

కుష్టు వ్యాధి డ్రగ్‌ తో కోలుకున్న కరోనా బాధితులు..!!

By:  Tupaki Desk   |   16 May 2020 11:00 PM IST
కుష్టు వ్యాధి డ్రగ్‌ తో కోలుకున్న కరోనా బాధితులు..!!
X
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మరణాలకు కారణమైన కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాల్లో ప్రపంచ దేశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి వ్యాక్సిన్ ఇంకా రాలేదు. రావడానికి ఎంత సమయం పడుతుందో కూడా చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో వివిధ డ్రగ్స్‌ను కరోనా నివారణకు ఉపయోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే అందుబాటులో ఉన్న మెడిసిన్ ఉపయోగిస్తున్నారు. మలేరియాకు వినియోగించే హెచ్‌సీక్యూ, ఎయిడ్స్‌కు ఉపయోగించే మెడిసిన్ కూడా వినియోగిస్తున్నారు.

భోపాల్‌కు చెందిన ఎయిమ్స్ సంస్థ కుష్ఠు వ్యాధి నివారణకు ఉపయోగించే మైకో బ్యాక్టీరియమ్ డబ్ల్యూ ఔషధంను కూడా వినియోగిస్తున్నారు. ఇది సమర్థవంతంగా పని చేస్తున్నట్లు ఫలితాలు వచ్చాయట. దీంతో మరింత పరిశోధన చేస్తున్నారట. ఎయిమ్స్‌లో ఈ తరహా చికిత్స ద్వారా ఇప్పటి వరకు ముగ్గురు కోలుకున్నట్లు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఈ మైక్రో బ్యాక్టీరియల్ ట్రయల్స్ వల్ల ఫలితం ఉంటే చికిత్స కోసం వినియోగిస్తామని చెబుతున్నారు.

కుష్టు వ్యాధి నివారణకు ఉపయోగించే మైకోబ్యాక్టీరియమ్ డ్రగ్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని, కరోనా క్లినికల్ ట్రయల్స్‌లో సమర్థవంతంగా పని చేసిందని ఎయిమ్స్ భోపాల్ డాక్టర్లు చెబుతున్నారు. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతితో గత కొద్ది రోజులుగా భోపాల్ ఎయిమ్స్‌లో పరిశోధన చేస్తున్నారు. ఇలా ముగ్గురు బాధితులు కరోనా బారి నుండి కోలుకున్నారని చెబుతున్నారు. క్లినికల్ ట్రయల్స్‌కు నలుగురు పేర్లు నమోదు చేసుకున్నారని, ముగ్గురు కోలుకున్నారని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ శర్మన్ సింగ్ అన్నారు. మరిన్ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామన్నారు.

ఈ డ్రగ్ ద్వారా బాధితులు వేగంగా కోలుకునే రేటును విశ్లేషించేందుకు కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) క్యాడిలా ఫార్మాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎయిమ్స్ ఢిల్లీ, ఎయిమ్స్ భోపాల్, పీజీఐ చండీగఢ్ ఆసుపత్రుల్లో పరిశోధనకు CSIRకు DCGI అనుమతి ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం వందలాది పరిశోధనలు జరుగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న భారత్ బయోటిక్ కూడా పరిశోధనలు చేస్తోంది.