Begin typing your search above and press return to search.

ముంబై వీధుల్లో కుక్క‌ను వేటాడిన చిరుత‌!

By:  Tupaki Desk   |   11 Sep 2017 8:53 AM GMT
ముంబై వీధుల్లో కుక్క‌ను వేటాడిన చిరుత‌!
X
ఇటీవ‌ల కాలంలో వ‌న్య మృగాలు జ‌నార‌ణ్యంలోకి త‌ర‌చు వ‌స్తుండ‌డం మ‌న‌కు తెలిసిందే. అడ‌వుల్లో నీరు దొర‌క్క, ఆహారం ల‌భించ‌క అవి అలా వ‌స్తున్న‌ట్టు అట‌వీ శాఖ అధికారులు చెప్ప‌డమూ మ‌న‌కు కొత్త‌కాదు. అలా వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా వాటిని బెదిరించ‌డ‌మో, అధికారుల‌కు స‌మాచారం అందించి వాటిని ప‌ట్టించ‌డమో చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి మ‌హారాష్ట్ర‌లోని ముంబైలో చోటు చేసుకుంది. న‌డివీధిలో ఓ చిరుత పులి రెచ్చిపోయింది. ఓ వీధికుక్క‌ను వెంటాడి వెంటాడి మ‌రీ త‌న పంజాతో ప‌డ‌గొట్టి నోట‌క‌రుచుకుని పోయింది. ఈ మొత్తం సంఘ‌ట‌నంతా సీసీటీవీలో రికార్డ్ అయింది. ప్ర‌స్తుతం ఈ రికార్డు దృశ్యాలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తూ.. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి, భ‌యానికీ గురి చేస్తున్నాయి.

విష‌యంలోకి వెళ్తే.. ముంబైలోని టేక్‌ వుడ్‌ కూపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ సమీపంలో సంజయ్‌గాంధీ నేషనల్‌ పార్క్ ఉంది. దీంతో ఈ పార్కు నుంచి జంతువులు అప్పుడ‌ప్పుడూ త‌ప్పించుకుని బ‌య‌ట‌కు వ‌చ్చి హ‌డావుడి సృష్టిస్తుంటాయి. ముఖ్యంగా టేక్‌ వుడ్‌ కూపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీలోకి జంతువులు త‌ర‌చూ వ‌స్తుంటాయ‌ట‌. దీంతో ఇక్క‌డి వారికి జంతువులు వ‌చ్చిపోతుండ‌డం పెద్ద వింతైతే కాదు. కానీ, ఈ నెల(సెప్టెంబర్‌) 5న తెల్లవారు జామున 4.04గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న ఓ ఘ‌ట‌న మాత్రం ఇక్క‌డి వారి గుండెల్లో గుబులు రేపుతోంది.

సంజయ్‌గాంధీ నేషనల్‌ పార్క్ నుంచి త‌ప్పించుకుని వ‌చ్చిన ఓ చిరుత పులి.. న‌డి రోడ్డుపై నిద్రిస్తున్న ఓ వీధి కుక్క‌పై ప‌డింది. దీనిని గ‌మ‌నించిన కుక్క పారిపోయేందుకు ప్ర‌య‌త్నించ‌గా చిరుత త‌న పంజాతో ఒక్క దెబ్బ‌కొట్టి.. కుక్క‌ను
నేల‌మ‌ట్టం చేసింది. అనంత‌రం, చుట్టూ ఎవ‌రైనా ఉన్నారా? లేరా? అని ప‌రిశీల‌న‌గా చూసి.. త‌ర్వాత కుక్క‌ను నోట క‌రుచుకుని పార్క్‌వైపు పారిపోయింది. ఈ దృశ్యాల‌న్నీ స‌మీపంలోని సీసీటీవీలో రికార్డ‌య్యాయి. దీనిని చూసిన స్థానికులు తీవ్ర భ‌య భ్రాంతుల‌కు గుర‌య్యారు. ప‌రిస్థితి ఇలా మారితే తాము నివ‌శించ‌లేమ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి పార్క్‌ అధికారులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.