Begin typing your search above and press return to search.

బిందెలో తలపెడితే పులయినా పిల్లే..

By:  Tupaki Desk   |   30 Sep 2015 12:13 PM GMT


ఈ మధ్య కాలంలో తగ్గింది కానీ.. గతంలో కట్టెలు పొయ్యిలు.. అందులోనూ వాకిళ్లలో ఆ పొయ్యిలు ఉన్న కాలంలో తరచూ వీధుల్లో ఒక దృశ్యం కనిపించేది. కుండలు - బిందెలు - ఇతర పాత్రల్లో తల ఇరుక్కుపోయిన భయంతో అరిచే కుక్కలు కనిపించేవి. వాటి వెనుక అల్లరి చేస్తూ తిరిగే పిల్లలు కనిపించేవారు. చివరకు పెద్దవాళ్లు ఎవరో జోక్యం చేసుకుని కుండ పగలగొట్టో.. బిందె కట్ చేసో ఆ కుక్కను కాపాడేవారు. ఇటీవలి కాలంలో ఇలాంటి సీన్లు కనిపించడంలేదు.. గ్రామాల్లో కూడా వంటిల్లు - అందులో గ్యాస్ స్టవ్ లు ఇంటింటికీ ఉంటుండడం కుక్కలు ఆశగా కుండల్లో మూతి పెట్టే రోజులు పోయాయి. అయితే...రాజస్థాన్ లో మాత్రం విచిత్రంగా ఇలాంటి సీనే ఒకటి కనిపించింది అయితే... బిందెలో తలపెట్టింది కుక్కకాదు... పులి. అవును... ఓ చిరుత పులి బిందెలో తల ఇరుక్కుపోవడంతో ఏమీ కనిపించక పిచ్చిపిచ్చిగా తిరిగింది. అంత పులి కూడా ఏం జరిగిందో అర్థం కాక... ఎందుకు కళ్లు కనిపించడం లేదో తెలియక భయంతో పిల్లిలా మారిపోయింది.

రాజస్థాన్ లోని రాజ సమంద్ లో బుధవారం ఓ చిరుత పులి బిందెలో తల పెట్టింది. నీటి కొరత, ఆహారం దొరక్క అడవిలోంచి జనావాసంలోనికి వచ్చిన ఆ చిరుత నీటి కోసం ఒక బిందెలో తలదూర్చింది. అంతే దాని తల దానిలో ఇరుక్కుపోయింది. ఈ సంఘటనతో బెంబేలెత్తిన ఆ చిరుత బిందెలోంచి తన తల ఎలా బయటకు తీసుకోవాలో తెలియక దిక్కు తోచక పరుగులెత్తింది. ఇదంతా గ్రామస్తులు వినోదంగా చూశారు. చివరకు కొందరు దాన్ని పట్టుకుని కాళ్లను తాళ్లతో కట్టేసి బిందెను కట్ చేసి దాన్ని రక్షించారు.