Begin typing your search above and press return to search.

చైర్మన్ వర్సెస్ కార్యదర్శి: 'కుదర్దు.. రూల్సొప్పుకోవు'

By:  Tupaki Desk   |   15 Feb 2020 12:37 PM IST
చైర్మన్ వర్సెస్ కార్యదర్శి: కుదర్దు.. రూల్సొప్పుకోవు
X
మూడు రాజధానుల ఏర్పాటుకు అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును, సీఆర్డీఏ రద్దు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి శాసనమండలిలో సెలెక్ట్ కమిటీ వేయాలని మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయించడం తో ఒక్కసారిగా పరిణామాలు మారి పోయాయి. అనంతరం సెలక్ట్ కమిటీకి బిల్లు పంపడంపై ప్రతిష్టంభన ఏర్పడింది. ఆ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్ మండలి కార్యదర్శికి ఫైల్ పంపగా తిరస్కరణకు గురైంది. ఈ విధంగా తిరస్కరించడం రెండోసారి. దీంతో చైర్మన్, కార్యదర్శి మధ్య వివాదం రాజుకుంది.

రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించలేదని, నియమాలు పాటించలేదని సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కుదరదని మండలి కార్యదర్శి ఆ ఫైల్ ను తిరిగి చైర్మన్ వద్దకు తిప్పి పంపారు. ఈ పరిణామం రాజ్యాంగ సంస్థపటం ఇప్పుడు ఏపీలో పెద్ద దుమారమే రేపింది. మండలి చైర్మన్ వర్సెస్ కార్యదర్శి రగడ ఏపీ శాసన మండలి వ్యవహారంలో కొనసాగుతుంది. అయితే కార్యదర్శిపై సభా ధిక్కరణ చర్యలు తీసుకోవటానికి న్యాయ నిపుణులతో సమాలోచనలు చేస్తున్నారు మండలి చైర్మన్. మరోవైపు కోర్టు ను ఆశ్రయించాలని భావిస్తుంది టీడీపీ.

సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కోసం వివిధ పార్టీల నుంచి సభ్యుల పేర్లను మండలి కార్యాలయానికి పంపి కమిటీ ఏర్పాటు చేయాలని ఛైర్మన్ షరీఫ్ ఫైల్ కార్యదర్శికి పంపించారు. అయితే రూల్‌ 154 కింద సెలెక్ట్ కమిటీ వేయడం చెల్లదని చెబుతూ మండలి కార్యాలయ కార్యదర్శి ఫైల్‌ మీద రాసి తిప్పి పంపారు. అయితే చైర్మన్ మళ్లీ ఫైల్ పంపి తనకున్న విచక్షణాధికారాల మేరకు సెలెక్ట్ కమిటీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నానని వెంటనే సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేసి తనకు నివేదించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనికి మండలి కార్యదర్శి కుదరదు.. ఏర్పాటు చేయాలేమంటూ మరోసారి చైర్మన్ కు ఆ ఫైల్ ను తిప్పి పంపారు. ఆ ఫైల్ ను తిరస్కరిస్తూ కార్యదర్శి ఓ లేఖ విడుదల చేశారు..

లేఖ సారాంశం:
’’బిల్లుల్ని సెలక్ట్ కమిటీ కి పంపించాలన్నది.. బిల్లును ఆమోదించడం ద్వారా జరగాలి. అది రాజ్యాంగం 189వ అధికరణలోని ఒకటో నిబంధన ప్రకారం జరగాలి. కానీ సభ మూడ్ ను బట్టి, లేదా ఏకాభిప్రాయాన్ని బట్టి కాదు. సభా కార్యకలాపాల నిర్వహణలో చైర్మన్ కు మార్గదర్శనం చేయడం, తోడ్పడడం కార్యదర్శి విధి. నిబంధనల అమలులో లోపాలుంటే దాన్ని తెలియజెప్పడాన్ని ధిక్కారంగా భావించ వద్దు‘‘ అంటూ వినయపూర్వకంగా కార్యదర్శి చైర్మన్ కు లేఖ పంపారు. దీంతో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది.

చైర్మన్‌ ఆదేశాలను కార్యదర్శి ధిక్కరించడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చైర్మన్ ఆదేశాలు కార్యదర్శి పట్టించుకోకపోతే ఎలా ప్రశ్నించింది. అయితే ఈ విషయమై కోర్టుకెళ్లే ఆలోచన లో ఆ పార్టీ ఉంది. ఢిల్లీ లో ఉన్న కొందరు సీనియర్‌ న్యాయ నిపుణులు, పార్లమెంటరీ వ్యవహారాల్లో అనుభవం ఉన్నవారి సలహాలను తీసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మండలి కార్యదర్శిపై సభా హక్కుల ధిక్కరణ కింద విచారణ జరపాలన్న ఆలోచన లో చైర్మన్, ఎమ్మెల్సీలు ఉన్నారు.