Begin typing your search above and press return to search.

మళ్లీ తెర పైకి శాసన మండలి రద్దు ... టెన్షన్ లో వైసీపీ నేతలు !

By:  Tupaki Desk   |   21 Jan 2020 9:23 AM GMT
మళ్లీ తెర పైకి శాసన మండలి రద్దు ... టెన్షన్ లో వైసీపీ నేతలు !
X
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం కొత్త రాజకీయ మలుపులకు కారణం అవుతుంది. మూడు రాజధానుల బిల్లులు శాసనసభలో ఆమోదం పొందిన తరువాత ఈ రోజు మండలిలో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ బిల్లుని మండలిలో టీడీపీ అడ్డుకుంటోంది. దీనితో మరోసారి శాసన మండలి రద్దు అంశం అసెంబ్లీ లాబీలలో వినిపిస్తుంది. దీని పైన కొద్ది రోజులుగా చర్చ సాగుతున్నా..దాని వలన వైసీపీకే రాజకీయంగా నష్టం జరుగుతుందనే అంచనాతో ఆ ప్రతిపాదన పక్కన పెట్టేసారు.

అయితే, శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రెండు బిల్లలను మండలి తిరస్కరించింది. ఇంగ్లీషు మీడియం స్కూళ్లు, ఎస్సీ కమిషన్ బిల్లును వర్గీకరణకు సవరణ కోరుతూ తిరస్కరించింది. దీనితో ప్రభుత్వం ఈ రెండు బిల్లులను ఈ రోజు తిరిగి శాసనసభలో ప్రవేశ పెట్టి ఆమోదానికి ప్రయత్నిస్తోంది. ఇక, ఇదే సమయంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకం గా భావిస్తున్న మూడు రాజధానుల బిల్లు విషయంలో టీడీపీ మండలిలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బిల్లులను మండలిలో ప్రవేశ పెట్టనీయకుండా ఉదయం నుండి రూల్ 71 కింద తీర్మానం పైన చర్చించాలని పట్టు బడుతోంది.

దీంతో మండలిలో టీడీపీ సభ్యుల మెజార్టీ కారణంగా వైసీపీ నేతలు మండలి కొనసాగింపు పైన అసహనంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. మండలి రద్దు చేయటం అంత సులువైన అంశం కాదని..దీనికి పార్లమెంట్ ఆమోదం కావాలని..దాదాపు సంవత్సర కాలం సమయం పడుతుందని టీడీపీ సీనియర్ నేత యనమల చెప్తున్నారు. మండలి రద్దు చేస్తే వైసీపీలో చీలక వస్తుందని జోస్యం చెప్పారు. అయితే, ప్రభుత్వం ఇప్పుడు బిల్లులు ఆమోదించుకొనేందుకే..వ్యూహాత్మకంగా ఈ ప్రచారం తెర మీదకు తీసుకొచ్చిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. శాసన మండలిలో ఉదయం నుండి జరుగుతున్న పరిణామాలు ఛైర్మన్ టీడీపీ ప్రతిపాదించిన తీర్మానం పైనచ చర్చకు అనుమతి ఇవ్వటం పైన వైసీపీ అసహనంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది.

ఇక, 2019 ఎన్నికల్లో అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వలేకపోయినా అనేక మందికి వైసీపీ అధినేత ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఈ జాబితాలో చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ సభ్యుల మెజార్టీ ఉన్నా.. వచ్చే ఏడాది నుండి ప్రస్తుతం ఉన్న సభ్యుల పదవీ కాలం ముగియటం మొదలు కానుంది. ఖాళీ అయిన స్థానాల్లో ప్రస్తుతం అధికారంలో ఉండటంతో పాటుగా..అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో వైసీపీ కి చెందిన వారే ఎమ్మెల్సీలు కానున్నారు. దీనితో ఇప్పుడు మండలి రద్దు చేస్తే టీడీపీ కంటే వైసీపీ కే ఎక్కువ నష్టం అన్న వాదన వినిపిస్తుంది.