Begin typing your search above and press return to search.

లెజండ‌రీ జ‌ర్న‌లిస్టు ల్యారీ క‌న్నుమూత!

By:  Tupaki Desk   |   24 Jan 2021 12:00 PM IST
లెజండ‌రీ జ‌ర్న‌లిస్టు ల్యారీ క‌న్నుమూత!
X
లెజండరీ టాక్ షో హోస్ట్, ప్రముఖ జర్నలిస్టు ల్యారీ కింగ్ క‌న్నుమూశారు. ప్ర‌ముఖ వార్తా ఛాన‌ల్‌ సీఎన్ఎన్ లో హోస్ట్‌గా ఆయ‌న‌ చాలా ఏళ్లు పనిచేశారు. ఆయ‌న హోస్టుగా వ్య‌వ‌హ‌రించిన‌ 'ల్యారీ కింగ్ లైవ్' అనే షో 25 ఏళ్ల పాటు నడిచింది.

ఈ షోలో అమెరికా అధ్యక్ష అభ్యర్థులు, సెలబ్రిటీస్, అథ్లెట్స్, మూవీ స్టార్స్ తోపాటు సాధారణ ప్రజలను కూడా ఆయన ఇంటర్వ్యూ చేశారు. 2010లో ఈ షోకు ల్యారీ గుడ్ బై చెప్పారు. ఈ షో న‌డిచిన‌ 25 ఏళ్లలో దాదాపు 6 వేల పైచిలుకు ఎపిసోడ్స్ ను న‌డిపిన ల్యారీ.. ఎంతో ఖ్యాతి గ‌డించారు.

కాగా.. ల్యారీ శనివారం ఉదయం చనిపోయారు. లాస్ ఏంజెల్స్‌లోని సెడార్స్ సినాల్ మెడికల్ సెంటర్‌లో ఆయ‌న తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు చాన్స్ ధృవీకరించారు. ఫేస్‌బుక్‌లో పోస్ట్ కూడా చేశారు. రేడియో, టీవీ, డిజిటల్ మీడియాలో ల్యారీ మంచి పేరు గడించారు. వేలాది ఇంటర్వ్యూలు చేసి మన్ననలు పొంద‌డ‌మే కాకుండా.. అనేక‌ అవార్డులను గెలుచుకున్నారు.

అయితే.. ల్యారీ మృతికి గల కారణం తెలియరాలేదు. ఆయ‌న ఏ సమస్యతో చనిపోయారనే విష‌యాన్ని ఎవ‌రూ ప్రకటించలేదు. అయితే.. ఆయ‌న‌ వృద్దాప్యం కార‌ణంగానే చ‌నిపోయిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ల్యారీ వ‌య‌సు 87 ఏళ్ల సంవ‌త్స‌రాలు. గత డిసెంబర్ లో ల్యారీకి కరోనా కూడా సోకింది. ఇది కూడా కార‌ణం అయ్యి ఉండొచ్చా? అనే సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. ల్యారీ మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.